Share News

Mallikarjun Kharge: ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లండి

ABN , Publish Date - Nov 16 , 2025 | 05:32 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఘన విజయంపై ఆ పార్టీ అధిష్ఠానం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర పార్టీ నేతల పనితీరును అభినందించింది..

Mallikarjun Kharge: ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లండి

  • స్థానిక సంస్థల్లోనూ విజయబావుటా ఎగరవేయండి

  • జీహెచ్‌ఎంసీ, మున్సిపల్‌ ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి

  • జూబ్లీహిల్స్‌లో ఘన విజయంపై రేవంత్‌, మహేశ్‌,భట్టి, నవీన్‌ యాదవ్‌లకు ఖర్గే, రాహుల్‌ అభినందనలు

  • జూబ్లీహిల్స్‌ తీర్పు మా రెండేళ్ల పాలనకు రెఫరెండం

  • డిపాజిట్‌ రాని కిషన్‌రెడ్డి దీనిపై మాట్లాడటం హాస్యాస్పదం

  • నేను మంత్రివర్గంలోకి వెళుతున్నాననే వార్తల్లో

  • వాస్తవం లేదు: టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

  • కేటీఆర్‌ వ్యాఖ్యలు అవాస్తవం..

  • నేనెవరిపైనా దాడి చేయలేదు: నవీన్‌యాదవ్‌

న్యూఢిల్లీ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఘన విజయంపై ఆ పార్టీ అధిష్ఠానం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర పార్టీ నేతల పనితీరును అభినందించింది. శనివారం ఢిల్లీలోని సోనియాగాంధీ నివాసంలో అగ్రనేత రాహుల్‌ గాంధీని సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, జూబ్లీహిల్స్‌ తాజా ఎమ్మెల్యే నవీన్‌యాదవ్‌ కలిశారు. నవీన్‌యాదవ్‌ను రాహుల్‌కు రేవంత్‌ పరిచయం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానంలో కాంగ్రెస్‌ విజయం సాధించడం శుభ పరిణామం, అభినందనీయమని రాహుల్‌ పేర్కొన్నారు. ‘‘గుడ్‌.. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లండి. స్థానిక సంస్థల్లోనూ విజయబావుటా ఎగురవేయండి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. అన్ని మున్సిపాలిటీల్లో విజయానికి ప్రణాళికలు సిద్ధం చేయండి’’ అని సూచించారు.

ఖర్గే, కేసీతో రేవంత్‌ బృందం భేటీ

రేవంత్‌, మహేశ్‌, భట్టి, నవీన్‌ ఒకే కారులో పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నివాసానికి వెళ్లి కలిశారు. ఉప ఎన్నికలో విజయం, రాష్ట్ర రాజకీయాలు, డీసీసీ అధ్యక్షుల నియామకం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై 45 నిమిషాల పాటు చర్చించారు. తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. కేసీతో చర్చించిన అంశాలను ఖర్గేకు వివరించారు. కార్యకర్తలకు కాంగ్రెస్‌ పార్టీనే ప్రథమమని, ఆ స్పూర్తితో ముందుకెళ్లడం వల్లే జూబ్లీహిల్స్‌లో ఘన విజయం సాధ్యమైందని రేవంత్‌ బృందాన్ని అభినందించారు.


డిపాజిట్‌ రాని కిషన్‌రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం: పీసీసీ చీఫ్‌

ఖర్గే నివాసం నుంచి బయటికి వచ్చిన తర్వాత భట్టి విక్రమార్క, నవీన్‌ యాదవ్‌తో కలిసి మహేశ్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘జూబ్లీహిల్స్‌లో భారీ మెజార్టీతో యావత్‌ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీతోనే ఉందనే సందేశాన్ని ఇచ్చింది. ఉప ఎన్నికల్లో విజయం మా రెండేళ్ల పాలనకు రెఫరెండం. ఇదే ఉత్సాహంతో జీహెచ్‌ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటాం. ఎంఐఎం మద్దతు, డబ్బులతో కాంగ్రెస్‌ గెలిచిందన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనం. బీజేపీ అభ్యర్థికి డిపాజిట్‌ కూడా దక్కించలేని కిషన్‌రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై నిబద్ధతతోనే ఉన్నాం. బలహీన వర్గాలకు ఈ రిజర్వేషన్లు అందకుండా బీజేపీ అడ్డుకుంటోంది’’ అని మహేశ్‌గౌడ్‌ ఆరోపించారు. మంత్రివర్గ విస్తరణలో మీ పేరు కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోందని మీడియా ప్రస్తావించగా.. అలాంటి ప్రచారంలో వాస్తవం లేదని మహేశ్‌గౌడ్‌ చెప్పారు. తర్వాత నవీన్‌ యాదవ్‌ మాట్లాడారు. ‘‘నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటా. కాంగ్రెస్‌ పెద్దలకు కృతజ్ఞతలు చెప్పడానికి ఢిల్లీ వచ్చాను. అగ్రనేతల ఆశీర్వాదం తీసుకున్నాను’’ అని చెప్పారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై తాను దాడి చేశానన్న కేటీఆర్‌ ఆరోపణలు అవాస్తవమన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 05:43 AM