Share News

BC Reservations Telangana: ఏం చేద్దాం

ABN , Publish Date - Aug 12 , 2025 | 05:02 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ

BC Reservations Telangana: ఏం చేద్దాం

  • బీసీ రిజర్వేషన్లపై పార్టీ పరంగా 42% ప్రకటించి ముందుకెళ్దామా?

  • కోర్టును మరింత సమయం కోరదామా?

  • రేవంత్‌రెడ్డి, మహేశ్‌గౌడ్‌ భేటీలో చర్చ

  • రాజకీయ వ్యవహారాల కమిటీలో నిర్ణయం

  • వారం రోజుల్లో నామినేటెడ్‌ పదవుల భర్తీ!

  • 23 నుంచి ప్రజాపథం పునఃప్రారంభం

  • ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం!

హైదరాబాద్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు. మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు రిజర్వేషన్లపై ముందుకెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నిర్ణయించారు. ఈ నెల 16 లేదా 17న పీఏసీ సమావేశాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. మహేశ్‌గౌడ్‌ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. స్థానిక ఎన్నికలు, నామినేటెడ్‌ పదవులు, ఇతర అంశాలపై చర్చించారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు కోర్టు ఇచ్చిన గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఎలా ముందుకువెళ్లాలన్నదానిపై సమాలోచనలు జరిపారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు, పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచుతూ తెచ్చిన ఆర్డినెన్సు రెండూ కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశం చర్చకు వచ్చింది. ఈ విషయాన్ని కోర్టుకు నివేదించి.. స్థానిక ఎన్నికల నిర్వహణకు మరికొంత గడువు కోరితే ఎలా ఉంటుందన్న విషయంపై నేతలిద్దరూ చర్చించారు. కోర్టు అనుమతిస్తే కేంద్రంపై మరోమారు ఒత్తిడి కార్యాచరణ చేపట్టవచ్చని భావిస్తున్నారు. అలా కాకుండా స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా 42ు రిజర్వేషన్‌ అమలు చేస్తున్నట్లుగా ప్రకటించి, ఎన్నికలకు వెళ్లడంపైనా చర్చించారు. పీఏసీ సమావేశం తర్వాతే స్థానిక ఎన్నికల నిర్వహణపై స్పష్టత రానుంది. పార్టీ పరంగా బీసీలకు 42ు రిజర్వేషన్‌ ప్రకటించి, ముందుకు వెళ్లాలని పీఏసీలో నిర్ణయం తీసుకుంటే.. సెప్టెంబరు 10 తర్వాత స్థానిక ఎన్నికలు ఉండొచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ లోపు ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది.


వారంలో నామినేటెడ్‌ పదవుల భర్తీ?

పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయాలని సీఎం రేవంత్‌, మహేశ్‌గౌడ్‌ నిర్ణయించినట్లు తెలిసింది. జిల్లా, లోక్‌సభ నియోజకవర్గ స్థాయి పరిశీలకులు.. నామినేటెడ్‌ పదవుల భర్తీకి సంబంధించి నియోజకవర్గానికి రెండు పేర్లతో ఇచ్చిన ప్రతిపాదనలు సీఎం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. స్థానిక ఎన్నికలకు ముందే ఈ పోస్టులను భర్తీ చేసి, కార్యకర్తల్లో కదలిక తీసుకురావాలన్న ఆలోచనలో రేవంత్‌రెడ్డి ఉన్నారు.

జూబ్లీహిల్స్‌ అభ్యర్థిపై మరో సర్వే!

గెలుపే ప్రాతిపదికగా, సర్వేల ఆధారంగా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిని నిర్ణయించనున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎంతో కీలకమైన ఈ ఉప ఎన్నికలో అభ్యర్థిపై ఎలాంటి ఒత్తిడికీ తావు లేకుండా.. సర్వేల ఆధారంగానే నిర్ణయానికి రావాలని అనుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీల వారీగా జరిగిన సర్వేలను పరిశీలించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్యే ఉంటుందని భావిస్తున్నారు. జూబ్లీహిల్స్‌ అభ్యర్థిత్వం కోసం ప్రస్తుతం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజారుద్దీన్‌, పార్టీ నేత నవీన్‌ యాదవ్‌, రెహమత్‌నగర్‌ కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డిలు ప్రధానంగా పోటీ పడుతున్నారు. వీరి అభ్యర్థిత్వాలపై పార్టీసర్వే జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రిత్వ శాఖల వారీగా సమీక్షించారు. జనహిత పాదయాత్రల ద్వారా వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలిద్దరూ నిర్ణయించారు. ఈ నెల 23 నుంచి పాదయాత్రను పునఃప్రారంభిస్తున్నామని, యాత్రలో ఒక రోజు పాల్గొనాలని సీఎం రేవంత్‌ను మహేశ్‌గౌడ్‌ కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు.

Updated Date - Aug 12 , 2025 | 05:02 AM