Victory in Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌దే విజయం
ABN , Publish Date - Oct 24 , 2025 | 06:32 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలవనుందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
క్యాబినెట్‌లో మైనారిటీలకు చోటు: మహేశ్ గౌడ్
నిజామాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలవనుందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేరుకు జూబ్లీహిల్స్ అయినా అక్కడ ఎంతోమంది పేదలు ప్రభుత్వ పథకాలను పొందుతున్నారని చెప్పారు. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా కాంగ్రెస్ వైపు మళ్లుతున్నారన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనను ప్రజలింకా మరిచిపోలేదన్నారు. సీఎం రేవంత్, రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ చౌకబారు ఆరోపణలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పాదయాత్రలు చేసినా స్వాగతిస్తామన్న మహేశ్‌గౌడ్.. తెలంగాణను దోచుకున్న ముఠాలో తన పాత్ర ఉందా, లేదా? అన్న సంగతి ‘కవిత జనంబాట’ పాదయాత్రలో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర క్యాబినెట్‌లో మైనారిటీలకు చోటు దక్కలేదని, డిసెంబరు, జనవరి నెలల్లో జరిగే విస్తరణలో చోటు కల్పిస్తామని మహేశ్ గౌడ్ తెలిపారు.