Share News

కాంగ్రెస్‌‌లో కొండా దుమారం

ABN , Publish Date - Jun 21 , 2025 | 03:29 AM

వివాదాలకు కేరాఫ్‌ అడ్ర్‌సగా మారిన మంత్రి కొండా సురేఖ దంపతుల తీరు కాంగ్రెస్‌ పార్టీలో దుమారం రేపుతోంది. ఇప్పటికే మంత్రి సురేఖ పలుమార్లు తన వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టగా..

కాంగ్రెస్‌‌లో కొండా దుమారం

  • మంత్రి కొండా సురేఖ దంపతుల తీరుతో చిచ్చు

  • మురళి వ్యాఖ్యలపై ఓరుగల్లు ఎమ్మెల్యేల ఆగ్రహం

  • నాయిని రాజేందర్‌రెడ్డి నివాసంలో నేతల భేటీ

  • కొండా దంపతులపై చర్యలు తీసుకోవాలంటూ..

  • అధిష్ఠానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం

వరంగల్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వివాదాలకు కేరాఫ్‌ అడ్ర్‌సగా మారిన మంత్రి కొండా సురేఖ దంపతుల తీరు కాంగ్రెస్‌ పార్టీలో దుమారం రేపుతోంది. ఇప్పటికే మంత్రి సురేఖ పలుమార్లు తన వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టగా.. గురువారం ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు చేసిన వ్యాఖ్యలు మరింత చిచ్చు రేపాయి. కొండా మురళి వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి నివాసంలో ఆయనతోపాటు స్టేషన్‌ఘనపూర్‌, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకా్‌షరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్‌ నాగరాజు, వరంగల్‌ ఎంపీ కడియం కావ్యతోపాటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్‌ గుండు సుధారాణి, కుడా చైర్మన్‌ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ భేటీ అయ్యారు. కొండా దంపతులు సొంత పార్టీ నేతలపై చేస్తున్న వాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకా్‌షరెడ్డిలపై కొండా మురళి చేసిన అనుచిత వ్యాఖ్యలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. కొండా దంపతుల తీరు పార్టీకి నష్టం చేకూర్చేలా ఉందని, మురళి వాఖ్యలు పార్టీ క్యాడర్‌ను దిగ్ర్భాంతికి గురి చేశాయని వారు అభిప్రాయపడ్డారు. వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.


మొదటినుంచీ దూరంగానే ఎమ్మెల్యేలు..

మంత్రి సురేఖతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యేలు మొదటి నుంచి దూరం దూరంగానే ఉంటున్నారు. జిల్లా నుంచి కాంగ్రె్‌సకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఐదారుగురు ఎమ్మెల్యేలతో కొండా దంపతులకు రాజకీయ వైరం కొనసాగుతోంది. నర్సంపేట ఎమ్మెల్యేతో తొలి నుంచీ రాజకీయ విభేదాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో పరకాల, వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలతో కూడా విభేదాలు వచ్చాయి. గతంలో మంత్రి సురేఖపై సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌లతో పాటు అప్పటి ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీకి కూడా వరంగల్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఫిర్యాదు చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ, మేయర్‌తో మంత్రి సురేఖకు సయోధ్య లేకపోవటంతో నిత్యం ఏదో ఒక ఫిర్యాదు అధిష్ఠానానికి చేరుతుందనే చర్చ జరుగుతోంది. గత జనవరిలో ఉమ్మడి వరంగల్‌లోని క్రషర్‌ నిర్వాహకులను కొండా దంపతులు ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. దేవాలయాల పాలక వర్గం నియామకాల్లో తమ నియోజకవర్గాల్లో కూడా మంత్రి సురేఖ తన అనుచరులకు అవకాశం ఇస్తున్నారని, దీంతో క్యాడర్‌లో అసంతృప్తి వ్యక్తమవుతోందనే ఫిర్యాదులు కూడా వెళ్లాయి.


ఫిర్యాదుకు ఐదుగురు సిద్ధం..

వరంగల్‌ జిల్లాలోని 11 మంది ఎమ్మెల్యేల్లో సురేఖతోపాటు సీతక్క మంత్రిగా కొనసాగుతుండగా.. ఐదుగురు ఎమ్మెల్యేలు కొండా దంపతులకు వ్యతిరేకంగా పార్టీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. డోర్నకల్‌, మహబూబాబాద్‌, పాలకుర్తి, నర్సంపేట ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటివరకు స్పదించలేదు. అయితే కొండా దంపతులతో కొందరు ఎమ్మెల్యేల మధ్య పెరిగిన విభేదాలు ఎక్కడి వరకు వెళతాయోననే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల ఫిర్యాదుతో అధిష్ఠానం కొండా దంపతులపై పార్టీపరంగా చర్యలు తీసుకుంటుందా..? లేక సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని సయోధ్య కుదిర్చే అవకాశం ఉందా అనే చర్చ కాంగ్రె్‌సలో ఉంది. కాగా, మంత్రి కొండా సురేఖ, మురళి ఇంకా బీసీ కుల కార్డును ప్రయోగించవద్దని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. ఇష్టారీతిగా మాట్లాడుతూ పార్టీకి నష్టం చేయవద్దని హితవు పలికారు. తమ వెంట ఉన్నవారిలోనూ బీసీలు, ఎస్సీలు, అన్ని వర్గాల వారు ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యేల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయంపై పార్టీ అధిష్టానం దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 03:29 AM