Share News

Congress Leaders: ఓడినా కేటీఆర్‌లో అహంకారం తగ్గలేదు

ABN , Publish Date - Nov 16 , 2025 | 05:39 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయం సాధించిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వైఖరిపై కాంగ్రెస్‌ నాయకులు మండిపడ్డారు.

Congress Leaders: ఓడినా కేటీఆర్‌లో అహంకారం తగ్గలేదు

  • కర్మ ఈజ్‌ బ్యాక్‌ అని నీ చెల్లెలే చెపుతోంది: ఆది శ్రీనివాస్‌

  • కేటీఆర్‌తో బీఆర్‌ఎస్‌ పతనం ఖాయం: అద్దంకి దయాకర్‌

హైదరాబాద్‌, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయం సాధించిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వైఖరిపై కాంగ్రెస్‌ నాయకులు మండిపడ్డారు. ఉప ఎన్నికలో చిత్తుగా ఓడిపోయినా కేటీఆర్‌లో అహంకారం ఇసుమంతైనా తగ్గలేదని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం, ఫేక్‌ సర్వేల పేరుతో మైండ్‌ గేమ్‌లు ప్లే చేసినా జనం ఛీ కొట్టారని విమర్శించారు. ‘‘కేటీఆర్‌.. ఒక ఎన్నిక కాదు, ప్రతి ఎన్నికల్లో నీ పార్టీని చిత్తు చిత్తు చేశాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా, కంటోన్మెంట్‌, జూబ్లీహిల్స్‌ బై ఎలక్షన్స్‌లో గాడిది గుడ్డు అయినా కేటీఆర్‌కు బుద్ధి రావడం లేదు. కర్మ ఈజ్‌ బ్యాక్‌ అని నీ చెల్లెలే చెపుతోంది’’ అంటూ శనివారం ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ.. కేటీఆర్‌ ఒక్కడితో బీఆర్‌ఎస్‌ పతనం ఖాయమన్నారు. బీసీలు అంటే కేటీఆర్‌కు చులకన అని, మాగంటి గోపీనాథ్‌ తల్లి చేసిన ఆరోపణలకు కూడా ఆయన సమాధానం చెప్పలేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి వస్తే బుల్డోజర్‌ వస్తది అన్న కేటీఆర్‌ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. బుల్డోజర్‌ వచ్చి కారును ఈడ్చుకుంటూ పోయిందని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ డ్రామా ప్రచారం, బీఆర్‌ఎస్‌ నేతల ఆహంకారపూరిత మాటలను ప్రజలు తిప్పికొట్టారని, రాబోయే స్థానిక ఎన్నికల్లో ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని టీపీసీసీ జనరల్‌ సెక్రటరీ చనగాని దయాకర్‌ అన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 05:44 AM