Share News

TPCC: పీసీసీకి నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు!

ABN , Publish Date - Feb 08 , 2025 | 02:36 AM

సీఎం రేవంత్‌, పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి ఉత్తమ్‌.. శుక్రవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ల తో పాటు ఉపాధ్యక్షులుగా నియమించే వారి పేర్లపై చర్చించారు.

TPCC: పీసీసీకి నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు!

ఖర్గేతో రేవంత్‌, ఉత్తమ్‌, భట్టి చర్చలు

వేణుగోపాల్‌తో వేర్వేరుగా భేటీ

వారంలోపు పీసీసీ కార్యవర్గం ప్రకటన

రాష్ట్రంలో కుల గణనపై ఖర్గే హర్షం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీకి నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లను నియమించే విషయంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. సీఎం రేవంత్‌, పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి ఉత్తమ్‌.. శుక్రవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ల తో పాటు ఉపాధ్యక్షులుగా నియమించే వారి పేర్లపై చర్చించారు. మధ్యాహ్నం తొలుత ఖర్గే, వేణుగోపాల్‌తో పార్లమెంట్‌లోని ఖర్గే కార్యాలయంలో దాదాపు గంటసేపు చర్చలు జరిపిన రాష్ట్ర నేతలు.. ఆ తర్వాత వేణుగోపాల్‌ను ఒకరి తర్వాత మరొకరు కలుసుకున్నారు. పీసీసీ కార్యవర్గంపై వారి అభిప్రాయాలను ఆయన వేర్వేరుగా తెలుసుకున్నట్లు సమాచారం. అధిష్ఠానంతో తమ చర్చలు పూర్తయ్యాయని వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షుల వరకు చర్చించామని, ప్రధాన కార్యదర్శులు, ఇతర ఆఫీసు బేరర్లు రాష్ట్ర స్థాయిలో నిర్ణయిస్తామని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఈ సందర్భంగా చెప్పారు. వారంలోపు కార్యవర్గాన్ని ప్రకటిస్తామని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు బీసీ వర్గానికి చెందిన వ్యక్తి అయినందున.. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళ వర్గాలకు చెందిన నేతలను పీసీసీ వర్కింగ్‌ అధ్యక్షులుగా నియమించే అవకాశాలున్నాయి. కాగా, తెలంగాణలో నిర్వహించిన కుల గణనపై ఖర్గే సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Updated Date - Feb 08 , 2025 | 02:36 AM