T Fiber Project: టి ఫైబర్ పై సమగ్ర నివేదిక సమర్పించండి
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:44 AM
ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు అందించే లక్ష్యంతో ప్రారంభించిన టి ఫైబర్ పనులు జరిగిన తీరు..
ప్రజలకు మెరుగైన సేవలందేలా చూడాలి: సీఎం రేవంత్
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు అందించే లక్ష్యంతో ప్రారంభించిన టి-ఫైబర్ పనులు జరిగిన తీరు.. దాని ప్రస్తుత పరిస్థితి.. భవిష్యత్‌లో చేపట్టనున్న పనులపై సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంపై ఇప్పటి వరకూ చేసిన ఖర్చు, పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు, ఆ నిధుల సేకరణ, కార్యక్రమం విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి నివేదికలో పొందుపర్చాలని సూచించారు. సోమవారం రాత్రి ఆయన తన నివాసంలో ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. టి-ఫైబర్ పనులు చేసిన కాంట్రాక్ట్ సంస్థలకు నోటీసులు ఇచ్చి.. పనులు చేసిన తీరుపై నివేదిక కోరాలని సీఎం ఆదేశించారు. సంస్థలో ఉద్యోగుల సంఖ్య, వారి పని తీరును సమీక్షించాలన్నారు. టి-ఫైబర్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. కాగా.. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు, టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.