Share News

Nalgonda: అధిక వడ్డీ పేరుతో రూ.కోట్ల వసూళ్లు !

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:01 AM

అధిక వడ్డీలు ఆశ చూపి గిరిజనుల నుంచి కోట్ల రూపాయల డబ్బు అప్పుగా తీసుకుంటూ భారీ స్థాయిలో వ్యాపారం చేస్తోన్న ఓ వ్యక్తిపై నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది.

Nalgonda: అధిక వడ్డీ పేరుతో రూ.కోట్ల వసూళ్లు !

  • ఏజెంట్లకు కమీషన్లు, నజరానాలు

  • గిరిజనుల నుంచి భారీగా డబ్బు సేకరణ

  • ఓ ప్రైవేటు వ్యాపారంపై నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు డీఏపీఎ్‌ఫఏజీ సంస్థ ఫిర్యాదు

నల్లగొండ, జూన్‌ 27(ఆంధ్రజ్యోతిప్రతినిధి): అధిక వడ్డీలు ఆశ చూపి గిరిజనుల నుంచి కోట్ల రూపాయల డబ్బు అప్పుగా తీసుకుంటూ భారీ స్థాయిలో వ్యాపారం చేస్తోన్న ఓ వ్యక్తిపై నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. దేవరకొండ ఏరియా పబ్లిక్‌ ఫ్రాడ్‌ అవేర్‌నెస్‌ గ్రూప్‌ (డీఏపీఎ్‌ఫఏజీ) అనే స్వచ్ఛంద సంస్థ ఈ ఫిర్యాదు చేసింది. ఆర్‌బీఐ నిబంధనలు పాటించకుండా ఏజెంట్ల సాయంతో డబ్బు వసూలు చేస్తోన్న నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం పలుగుతండాకు చెందిన రమావత్‌ బాలాజీపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరింది. రమావత్‌ బాలాజీ ప్రజల నుంచి దాదాపు రూ.1000 కోట్లు సేకరించాడని డీఏపీఎ్‌ఫఏజీ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదుకు స్పందించిన జిల్లా కలెక్టర్‌ ఇలాత్రిపాఠి.. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ను, ఆదాయ పన్ను శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రమావత్‌ బాలాజీని అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నట్టు తెలిసింది.


ఏజెంట్‌ వ్యవస్థ.. సకాలంలో వడ్డీ చెల్లింపులు

స్థానికుల కథనం ప్రకారం.. రమావత్‌ బాలాజీ హైదరాబాద్‌లో ఉంటూ నాలుగు నెలలుగా ఈ వ్యాపారం చేస్తున్నాడు. చేపల వ్యాపారైన తండ్రి రమావత్‌ జబ్బార్‌ సొంత తండాలో పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో బాలాజీ నగదు సేకరణ సులువుగానే చేపట్టాడు. క్రమంగా దాదాపు 15 మంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని... పీఏపల్లి, చందంపేట, కొండమల్లేపల్లి, మిర్యాలగూడ, దేవరకొండ, తిరుమలగిరిసాగర్‌ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు, ఇతరుల నుంచి డబ్బులు సేకరిస్తున్నాడు. తనకు డబ్బు ఇచ్చిన వారికి నెలకు పది శాతం వడ్డీ ఇస్తాడు. ఆయా వడ్డీలను నెలనెలా క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాడు. దీంతో బాలాజీకి డబ్బు ఇచ్చేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. బాలాజీ ఇలా రూ.కోట్లలో డబ్బు సేకరించాడని చెబుతున్నారు.


ఖాతాదారులను తీసుకొచ్చిన ఏజెంట్లకు బాలాజీ 6 శాతం కమీషన్‌ ఇస్తాడని, పెద్ద మొత్తంలో పెట్టుబడులు తెచ్చిన వారికి అదనంగా నజరానాలు కూడా ఇస్తుంటాడని చెబుతున్నారు. రూ.2 కోట్ల వరకు పెట్టుబడి తెచ్చిన ఏజెంట్‌కు స్విఫ్ట్‌ కారు, రూ.కోటి పెట్టుబడి తెచ్చిన వారికి రూ.1లక్ష విలువైన బైక్‌ ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఏజెంట్లు కూడా పోటీ పడి నగదు సేకరణ చేపడుతున్నారు. కాగా, బాలాజీ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని, రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు పోలీసులు దర్యాప్తులో తేలినట్టు తెలిసింది. ఫిర్యాదు, విచారణ వ్యవహారం బయటికి రావడంతో బాలాజీని నమ్మి డబ్బు ఇచ్చిన పలువురు నల్లగొండ ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఆరా తీస్తున్నారు. అయితే, పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే పోలీసులు వివరాలు వెల్లడించాలని నిర్ణయించినట్టు తెలిసింది. కాగా, ఈ వ్యవహారంపై వివరణ కోసం జిల్లా ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు.

Updated Date - Jun 28 , 2025 | 04:01 AM