Share News

CM Revanth Reddy Unveils Telangana Rising: పేదరికం, జాతి వివక్ష నిర్మూలనకే..విజన్‌ డాక్యుమెంట్‌

ABN , Publish Date - Dec 10 , 2025 | 04:33 AM

రాష్ట్రంలో పేదరికం, జాతి వివక్షల నిర్మూలన కోసమే తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు...

CM Revanth Reddy Unveils Telangana Rising: పేదరికం, జాతి వివక్ష నిర్మూలనకే..విజన్‌ డాక్యుమెంట్‌

  • కుగ్రామం నుంచి వచ్చిన నేను వాటిని దగ్గరగా చూశా

  • నాకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన నిరుపేదలకు న్యాయం చేయాలన్నదే నా నిబద్ధత

  • సమ్మిట్‌ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేదరికం, జాతి వివక్షల నిర్మూలన కోసమే తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. తనకు సీఎంగా అవకాశం ఇచ్చిన నిరుపేదలకు న్యాయం చేయాలన్నదే తన నిబద్ధత అని చెప్పారు. ఈ విజన్‌ డాక్యుమెంట్‌తో.. 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీని సాధించి, ప్రధాని మోదీ చేపట్టిన వికసిత్‌ భారత్‌లో ముందుభాగాన నిలవాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఫ్యూచర్‌ సిటీలో మంగళవారం జరిగిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ ముగింపు కార్యక్రమంలో విజన్‌ డాక్యుమెంట్‌ను సీఎం ఆవిష్కరించారు. టోనీ బ్లెయిర్‌, శంతన్‌ నారాయణ్‌ల దగ్గరి నుంచి ఈ విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పనలో భాగస్వాములైన వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానన్నారు. ఈ డాక్యుమెంట్‌ రూపకల్పనకు.. ఆన్‌లైన్‌ ద్వారా సుమారు 4 లక్షల మంది తమ సలహాలూ, సూచనలు ఇచ్చారని తెలిపారు. రైతులు, సామాన్యులు, మహిళలు, విద్యార్థులు తదితరులందర్నీ భాగస్వాములను చేసి విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, సినీ హీరో చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

ఇంకా ఎదురుచూపులు..

తెలంగాణ ప్రాంత మట్టికి గొప్ప చైతన్యం ఉందని సీఎం రేవంత్‌ గుర్తుచేశారు. జల్‌, జంగల్‌, జమీన్‌ కోసం కొమురం భీం పోరాటం చేస్తే.. భూమి, భుక్తి, విముక్తి, పేదరిక నిర్మూలన కోసం సాయుధ రైతాంగ పోరాటంలో వేలాది మంది నేలకొరిగిన చరిత్ర ఈ ప్రాంతానికుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజల ఆకాంక్షను సోనియా, మన్మోహన్‌ సింగ్‌ నెరవేర్చారని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఉన్నతమైన అభివృద్ధి సాధించగలిగే శక్తి, వనరులు ఉన్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో ఈ గడ్డపై ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరగలేదన్నారు. ఇప్పటికీ తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం ఎదురుచూస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి వందేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో.. ప్రధాని మోదీ 30 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ సాధించడం లక్ష్యంగా పెట్టుకుని వికసిత్‌ భారత్‌ కార్యక్రమాన్ని చేపట్టారని గుర్తు చేసిన సీఎం.. ఆ కార్యక్రమంలో రాష్ట్రం ముందుభాగాన నిలిచి,2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ సాధించాలన్న లక్షాన్ని పెట్టుకున్నట్లు చెప్పారు. దేశ జీడీపీలో ప్రస్తుతం 5 శాతంగా ఉన్న తెలంగాణ వాటాను.. ఈ విజన్‌ డాక్యుమెంట్‌తో పది శాతానికి చేర్చాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు. ప్రపంచంతో అనుసంధానం కావడానికి మౌలిక వసతులను అభివృద్ధి చేసి పెట్టుబడులను ఆహ్వానించాలనుకుంటున్నట్లు చెప్పారు.


వివక్షను దగ్గర్నుంచి చూశా!

ఒక కుగ్రామంలోని రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను చిన్నతనం నుంచి పేదరికం, వివక్షతలను దగ్గరనుంచి చూశానని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. విద్య, యువతకు ఉపాధి కల్పన ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలనుకుంటున్నట్లు చెప్పారు. అలాగే మెరుగైన వైద్యాన్నీ అందివ్వాలనుకుంటున్నామన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు మనిషి జీవిత కాలం సగటున 32 ఏళ్లుగా ఉంటే.. నెహ్రూ విజన్‌ ఫలితంగా అది ప్రస్తుతం 73 సంవత్సరాలకు చేరుకుందన్నారు. భవిష్యత్తులో అది వందేళ్లకూ చేరుకుంటుందన్నారు. అభివృద్ధి అన్నది కుగ్రామం వరకూ చేరాలన్నారు. పేదరికం అన్నది కొందరికి ఎక్స్‌కర్షన్‌ లాంటిదని, పేదలు ఎలా ఉంటారో చూసేందుకు నగరం నుంచి బెంజ్‌ కారులో వచ్చి చూసి వెళ్లి పోతారని అన్నారు. కానీ చిన్న గామ్రంలో, రైతు కుటుంబంలో పుట్టి... ప్రభుత్వ స్కూల్లో తెలుగు మీడియంలో చదివిన తనకు పేదలకు, నిరుద్యోగులకు ఏం కావాలో, వారు ఎలా ఆలోచిస్తారో తెలుసునన్నారు. ఆదివాసీలు, దళితులు, మైనారిటీలు, బలహీన వర్గాల సమస్యలూ తెలుసునన్నారు. ఆయా వర్గాల వారితో తనకు వ్యక్తిగత సంబంధాలూ ఉన్నాయన్నారు. 2006లో జడ్పీటీసీగా ప్రస్థానాన్ని ప్రారంభించి 17 ఏళ్లలో తెలంగాణ సీఎం అయిన తనకు రాజకీయ వారసత్వం కూడా లేదని గుర్తుచేశారు. రాష్ట్రంలోని నిరుపేదలకు న్యాయం జరగాలన్నదే తన పాలసీ డాక్యుమెంట్‌ అని చెప్పారు.

ఒక్కో స్కూల్‌కూ రూ.200 కోట్లు..

జాతి వివక్ష ఉండకూడదంటున్న ప్రభుత్వాలే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం వేర్వేరుగా గురుకులాలను, హాస్టళ్లను ఏర్పాటు చేశాయని, అవి వేర్వేరుగా ఉంటే వివక్ష ఎట్లా పోతుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అందుకే అన్ని వర్గాల్లోని అందరు విద్యార్థులూ ఒక్క చోట కలిసి చదివేలా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల ఏర్పాటుకు ప్రణాళిక చేశామన్నారు. ఒక్కో స్కూల్‌ నిర్మాణానికీ రూ.200 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఆ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకే రూ.20 వేల కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు. సంక్షేమం కోసం చేసేఖర్చు బాధ్యత అయితే.. విద్యపైన చేసే ఖర్చు భవిష్యత్తుపై పెట్టుబడి అని సీఎం అభివర్ణించారు. ప్రస్తుత విద్యా విధానంలో నాణ్యత, నైపుణ్యాలు లేనందునే యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీ, స్పోర్ట్స్‌ వర్సిటీలను ప్రారంభించినట్లు చెప్పారు.

Updated Date - Dec 10 , 2025 | 04:33 AM