Share News

CM Revanth Reddy: ప్రతి పోలీసుకు వంగర పోలీసులు ఆదర్శం

ABN , Publish Date - Jun 12 , 2025 | 03:02 AM

సైకిలెక్కి గ్రామాల్లో తిరుగుతూ గంజాయి, సైబర్‌ నేరాలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న హనుమకొండ జిల్లా వంగర పోలీసులు రాష్ట్రంలోని ప్రతీ పోలీసుకు ఆదర్శమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొనియాడారు.

CM Revanth Reddy: ప్రతి పోలీసుకు వంగర పోలీసులు ఆదర్శం

వారిది నిజమైన పోలీసింగ్‌ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రశంస

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ట్యాగ్‌ చేస్తూ ఎక్స్‌లో పోస్ట్‌

  • వంగర పోలీసులను అభినందించిన డీజీపీ, జితేందర్‌ రెడ్డి, మంత్రి పొన్నం

భీమదేవరపల్లి, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): సైకిలెక్కి గ్రామాల్లో తిరుగుతూ గంజాయి, సైబర్‌ నేరాలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న హనుమకొండ జిల్లా వంగర పోలీసులు రాష్ట్రంలోని ప్రతీ పోలీసుకు ఆదర్శమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొనియాడారు. ఈ మేరకు వంగర పోలీసులను సోషల్‌ మీడియా వేదికగా అభినందించారు. ‘వారెవ్వా వంగర పోలీసు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో బుధవారం ప్రచురితమైన కథనానికి సంబంధించిన చిత్రాన్ని ట్యాగ్‌ చేస్తూ ఎక్స్‌లో ఆయన ఓ పోస్టు చేశారు. నేర నియంత్రణకు కఠినంగా వ్యవహరించడమే కాదు, నేరాల జరగడానికి మూల కారణాలను అన్వేషించి అర్థం చేసుకుని పరిష్కార మార్గాలను అమలు చేయడమే నిజమైన పోలీసింగ్‌ అని ముఖ్యమంత్రి తన పోస్టులో పేర్కొన్నారు.


గ్రామాల్లో యువత తప్పుదోవ పట్టకుండా, గంజాయి వంటి దురలవాట్ల జోలికి పోకుండా, సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తూ, విద్య ప్రాధాన్యాన్ని వివరిస్తూ, సాంఘిక దురాచారాలపై చైతన్యం కల్పిస్తూ వంగర పోలీసులు నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. రాష్ట్రంలోని ప్రతీ పోలీసులకు వంగర పోలీసులు ఆదర్శమని ప్రశంసించారు. వంగర పోలీస్‌ సిబ్బంది ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. అలాగే, వంగర పోలీసులకు రాష్ట్ర డీజీపీ జితేందర్‌ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌ కూడా అభినందనలు తెలిపారు. ప్రజలతో మమేకమై యువతకు గంజాయి, డ్రగ్స్‌, సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తూ, ప్రజలను అప్రమత్తం చేస్తున్న వంగర పోలీసుల కృషి అభినందనీయమని డీజీపీ జితేందర్‌రెడ్డి ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇక, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎస్సై దివ్యకు ఫోన్‌ చేసి పోలీసుల కృషిని అభినందించారు.

Updated Date - Jun 12 , 2025 | 03:02 AM