Share News

CM Revanth Reddy Urge: సమస్యలపైవిద్యార్థులకుకొట్లాడే స్వేచ్ఛ

ABN , Publish Date - Dec 11 , 2025 | 05:23 AM

విద్యార్థులకు సమస్యలపై కొట్లాడే స్వేచ్ఛ ఎల్లప్పుడూ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే రాజకీయ పార్టీల ఉచ్చులో పడకుండా..

CM Revanth Reddy Urge: సమస్యలపైవిద్యార్థులకుకొట్లాడే స్వేచ్ఛ

  • పార్టీల ఉచ్చులో పడకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడండి

  • దమ్ముంటే ఓయూకు వెళ్లాలని సవాల్‌ చేశారు

  • వాళ్లలా దొంగను కాదు.. గడీలు కట్టుకోలేదు

  • విదేశీ భాష రాకున్నా.. పేదోడి మనసు చదవడం వచ్చు

  • రెండేళ్లలో ఓయూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం

  • పైరవీకొచ్చే మంత్రులు, ఎమ్మెల్యేల ఉద్యోగాలు పీకేస్తాం

  • ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ ఎదుట సభలో సీఎం రేవంత్‌రెడ్డి

  • వర్సిటీ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు విడుదల

  • ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌.. పవార్‌ ఇంట్లో విందుకు హాజరు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు సమస్యలపై కొట్లాడే స్వేచ్ఛ ఎల్లప్పుడూ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే రాజకీయ పార్టీల ఉచ్చులో పడకుండా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలని సూచించారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్‌ కాలేజీ ఎదుట నిర్వహించిన సభలో సీఎం పాల్గొన్నారు. ఓయూ అభివృద్ధికి రూ.1000 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వర్సిటీ అభివృద్ధికి సిద్ధం చేసిన మాస్టర్‌ప్లాన్‌, డిజైన్లను, విద్యార్థుల సూచనల కోసం రూపొందించిన క్యూఆర్‌ కోడ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ‘‘మీకు స్వేచ్ఛ ఉంది.. సామాజిక న్యాయం జరుగుతుంది.. సమానమైన అవకాశాలిస్తాం. రాజకీయ పార్టీల ఉచ్చులో పడకండి. చదువుకోండి.. భవిష్యత్తును నిర్మించుకోండి. సమస్యలపై కొట్లాడతానంటే వద్దనను. రాష్ట్రానికి ఏది ప్రయోజనమో దానికోసం కొట్లాడండి. సర్వ స్వతంత్రతను మీరు నిరూపించుకోండి. కష్టపడితే ఫలితాలు వస్తాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా ఎదగడంతోపాటు నాయకులై ఈ రాష్ట్రాన్ని పాలించాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.


తమ్ముళ్లు, చెల్లెళ్లు ఉన్నారనే వచ్చాను..

108 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా వర్సిటీ దేశంలోనే అత్యంత ప్రాచీన వర్సిటీల్లో ఏడో స్థానం, దక్షిణ భారతదేశంలో మూడో ప్రాధాన్యం కలిగి ఉందని అన్నారు. అలనాటి స్ఫూర్తితో భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందించుకోవడానికి అందరినీ కలిసేందుకు ఓయూకు వచ్చానని తెలిపారు. ‘‘ఓయూలో మంత్రులు, సీఎంలను అడ్డుకునే చరిత్ర ఉందని, మీరెందుకు వెళ్తున్నారని నన్ను కొందరు అడిగారు. మీరు చాలా ధైర్యం చేస్తున్నారని కొందరన్నారు. కానీ, నాది ధైర్యం కాదు.. అభిమానం. నా చెల్లెళ్లు, తమ్ముళ్లు ఉన్న వర్సిటీకి వెళ్లేందుకు ధైర్యం అవసరమా? గుండెల నిండా అభిమానంతో భవిష్యత్తు ప్రణాళిక కోసం ఇక్కడికి వచ్చాను. తెలంగాణ గడ్డకు ఒక చైతన్యం, పౌరుషం ఉంది. ఆధిపత్యం చెలాయించాలని చూసిన ప్రతిసారీ తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది. తెలంగాణ తొలిదశ ఉద్యమం ఓయూలోనే పుట్టింది. మలిదశ ఉద్యమంలో ఓయూ ముందు బాగాన నిలిచింది. సమాజానికి ఏ సమస్య వచ్చినా యూనివర్సిటీ విద్యార్థులు కదలడం వల్లే ఆ సమస్యకు పరిష్కారం లభించింది’’ అని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.

ఫామ్‌హౌజ్‌లు కావాలని అడగలేదు..

తెలంగాణ వచ్చాక తమ్ముళ్లు, చెల్లెళ్లు ఎవరి ఆస్తులనూ అడగలేదని, ఎర్రవల్లి, జన్వాడ, అజీజ్‌నగర్‌, శంకర్‌పల్లిలో కట్టుకున్న ఫామ్‌హౌజ్‌లు కావాలనీ అడగలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మాత్రమే అడిగారని తెలిపారు. కానీ, పదేళ్లలో యూనివర్సిటీని పట్టించుకోకపోగా.. కాలగర్భంలో కలపడానికి కుట్రలు పన్నారని ఆరోపించారు. ‘ప్రజా ప్రభుత్వంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందిస్తున్నాం. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడని అంటున్నారు. అవును.. నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా. నాకు విదేశీ భాష రాకపోవచ్చు. కానీ, పేదవాడి మనసును చదవడం వచ్చు. గుంటూరులో చదివి గూడుపుఠాణీలు చేయడం లేదు. ఒకాయన చేతనైతే ఆర్ట్స్‌ కాలేజీ దగ్గరకు పోయిరా అంటూ సవాల్‌ విసిరిండు. వాళ్లలా దొంగను కాదు. ఫామ్‌హౌజ్‌లు, గడీలు కట్టుకోలేదు. పేదలకు సంక్షేమం అందేలా పరిపాలన చేయడం వచ్చు’’ అని సీఎం అన్నారు.


చరిత్ర గుర్తుంచుకునేలా పాలించాలి..

చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన ఉండాలన్నదే తన ఆకాంక్ష అని రేవంత్‌ తెలిపారు. ప్రభుత్వం వద్ద పంచడానికి భూములు లేవంటే విమర్శిస్తున్నారని, మరి.. దళితులకు మూడెకరాలు ఇస్తామని హామీ ఇచ్చి పదేళ్లలో ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. 3వేల ఎకరాల్లో ఫామ్‌హౌజ్‌లు కట్టుకొని దళితులకు ఎకరం భూమి ఇచ్చారా? అని ప్రశ్నించారు. భూమి లేకపోవడం పేదరికం కావచ్చునేమో కానీ, చదువు లేకపోవడం వెనుకబాటుతనమని అన్నారు. విద్య ఒక్కటే ఈ వెనుకబాటుతనాన్ని రూపుమాపుతుందన్నారు. అందరికీ నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు. ఓయూకు వచ్చేటప్పుడు ఉత్తచేతులతో రానని ఆనాడే చెప్పానని, రూ.వెయ్యి కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని ప్రకటించారు. రెండేళ్లలో వర్సిటీకి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తాను వ్యవసాయం చేసినవాణ్నని, చేనుకు ఏ పురుగు పడితే ఏ మందు కొట్టాలో తెలుసునని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణకు పట్టిన చీడను ఎలా వదిలించాలో కూడా తనకు తెలుసునన్నారు. ‘‘ప్రపంచాన్ని ఏలుతున్న జర్మనీ, జపాన్‌, చైనాలకు ఇంగ్లీషు రాదు. మనం కనీసం ఏబీసీడీలైనా రాయగలుగుతున్నాం. ప్రపంచాన్ని శాసిస్తూ ఇంగ్లీషు మాట్లాడే అమెరికాకు చైనా సర్‌ప్లస్‌ ఆపితే గంట కూడా జీవించలేదు. యువ మిత్రులెవరూ ఇంగ్లీషు రాదని ఏమీ పెట్టుకోవద్దు. అదీ విషయమేమీ కాదు. కావాలంటే ఇంగ్లీషు వచ్చిన పది మందిని ఉద్యోగులుగా పెట్టుకుంటా. భాష అనేది కమ్యూనికేషన్‌ మాత్రమే. నాలెడ్జ్‌ వేరు.. కమ్యూనికేషన్‌ వేరు’’ అని రేవంత్‌ వ్యాఖ్యానించారు. నాలెడ్జ్‌, కమిట్‌మెంట్‌, కన్విక్షన్‌ ఉంటే దేశంలో ఏ స్థాయికైనా ఎదగవచ్చన్నారు. వర్సిటీలో టీచింగ్‌ స్టాఫ్‌ కోసం కమిటీ వేశామని, నియామకాలు చేసుకునే స్వతంత్ర ప్రతిపత్తి కల్పించామని తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పైరవీలతో వస్తే తనకు చెప్పాలని, వారి ఉద్యోగాలు పీకేస్తామన్నారు. ముగ్గురు ప్రముఖ ఆర్కిటెక్ట్‌లతో యూనివర్సిటీ అభివృద్ధి డిజైన్లను రూపొందించారని, వీటిపై అధ్యాపకులు సూచనలిస్తే నెలాఖరుకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.


ఎమ్మెల్సీ వెంకట్‌ను అడ్డుకున్న విద్యార్థులు

ఉస్మానియా యూనివర్సిటీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓయూ పర్యటనలో ఉద్యోగ నోటిఫికేషన్లపై ఎటువంటి ప్రకటన చేయలేదంటూ విద్యార్థులు నిరసన తెలిపారు. తమకు ఉద్యోగాలు కావాలంటూ నినాదాలు చేశారు. సీఎం ప్రసంగం ముగించుకొని వెళ్తుండగా విద్యార్థులు కాన్వాయ్‌ వైపు వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ను అడ్డుకుని నిలదీశారు. పోలీసులు వారిని చెదరగొట్టే క్రమంలో మీడియా ప్రతినిధులను కూడా నెట్టేశారు. దీంతో పోలీసులకు, మీడియా ప్రతినిధులకు మధ్య కొంత వాగ్వాదం జరిగింది. మరోవైపు ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను సీఎం పట్టించుకోలేదంటూ ఓయూ ఉద్యోగులు నిరసన తెలిపారు. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో కొంత మంది విద్యార్థి నాయకులను పోలీసులు ముందు రోజు అర్ధరాత్రి నుంచే అరెస్టు చేశారు.

ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌

శంషాబాద్‌ రూరల్‌: కాంగ్రెస్‌ అధిష్ఠానం పిలుపు మేరకు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మద్యాహ్నం ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ఇంట్లో జరిగిన విందుకు హాజరయ్యారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతో కలిసి ఈ విందులో రేవంత్‌ పాల్గొన్నారు. గురువారం పార్లమెంట్‌లో ఖర్గే, రాహుల్‌, ప్రియాంక, వేణుగోపాల్‌ను రేవంత్‌ కలవనున్నట్లు తెలిసింది.

1.jpg

Updated Date - Dec 11 , 2025 | 05:24 AM