CM Revanth Reddy: 21న ఓయూలో హాస్టల్ భవనాలను.. ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:34 AM
ఉస్మానియా యూనివర్సిటీలో 1,200 మంది విద్యార్థులకు వసతి కల్పించే విధంగా రూ. 80 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు హాస్టల్ భవనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
ఆ హోదాలో ఓయూలో ప్రసంగించనున్న తొలిసీఎం
హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా యూనివర్సిటీలో 1,200 మంది విద్యార్థులకు వసతి కల్పించే విధంగా రూ. 80 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు హాస్టల్ భవనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈమేరకు ఓయూ ఉప కులపతి ప్రొ. కుమార్ మొలుగరం, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ. సి కాశీం ఆదివారం సీఎం నివాసంలో ఆయన్ను కలిసి ఆగస్టు 21న జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. ఇరవై ఏళ్ల కాలంలో ఓయూలోకి ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ప్రసంగించనున్న తొలి సీఎం రేవంత్ రెడ్డినే అని వారు చెప్పారు. అదే రోజు ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ప్రొఫెసర్లను, విద్యార్థులను ఉద్దేశించి ‘‘తెలంగాణ విద్యా రంగంలో రావాల్సిన మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక’’ అనే అంశం మీద సీఎం ప్రసంగించనున్నారు.
అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సహాయంతో మరో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే రెండు కొత్త హాస్టళ్ల నిర్మాణాలకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. దాంతో పాటు ఈ కార్యక్రమంలో ‘‘సీఎం రీసెర్చ్ ఫెలో షిప్’’ అనే పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.