Water Dispute Solutions: జలసౌధలో నేడు ప్రాజెక్టులపై సీఎం సమీక్ష
ABN , Publish Date - May 07 , 2025 | 07:29 AM
జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ అవార్డు జారీకి కేంద్ర జలశక్తి శాఖ సిద్ధంగా ఉన్నా, ముఖ్యంగా తెలంగాణకు నష్టం జరగకపోవడం కోసం సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. 400 మంది నీటి పారుదల శాఖ ఉద్యోగులకు నియామక పత్రాలు ఇవ్వనున్న సీఎం
కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లతోనూ సమావేశం
కొత్త ఏఈలు, జేటీవోలకు నియామక పత్రాల అందజేత
హైదరాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి): ప్రాధాన్య ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించానున్నారు. బుధవారం జలసౌధకు వెళ్లనున్న సీఎం.. ఆయా ప్రాజెక్టులకు 15నెలలుగా నిధులు ఏ విధంగా విడుదలవుతున్నాయి? పనుల పురోగతి ఏ విధంగా ఉంది? పనుల పూర్తికి ఉన్న ప్రతిబంధకాలపై సమీక్షించనున్నారు. కృష్ణా జలాల వివాదంతోపాటు నీటి కేటాయింపులు, ఎన్జీటీ కేసులు, జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ విచారణతోపాటు సుప్రీంకోర్టులో ఉన్న కేసుల వివరాలను నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆదిత్యనాథ్‌దాస్ సీఎంకు వివరించనున్నారు.
ఇప్పటికే జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ అవార్డును నోటిఫై చేయడానికి కేంద్ర జలశక్తి శాఖ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో పర్యవసానాలేంటి? ఏ రాష్ట్రానికి తక్షణ మేలు జరగనుంది? ప్రధానంగా తెలంగాణకు జరగనున్న అన్యాయంపై సీఎం చర్చించి, అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చే అవకాశాలున్నాయి. కాగా, నీటి పారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్లు(ఏఈ), జూనియర్ టెక్నికల్ అధికారులుగా ఎంపికైన 400మందికి మంత్రి ఉత్తమ్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు. అనంతరం కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు, సభ్యులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు.