Share News

CM Revanth Reddy: మీరు మారరా

ABN , Publish Date - Oct 26 , 2025 | 04:54 AM

హైదరాబాద్‌లో చెత్త సేకరణ, శుభ్రత విషయం కూడా నేనే చెప్పాలా. ఎటు చూసినా రోడ్లపై చెత్త కనబడుతోంది. మీకు కనబడడం లేదా..

CM Revanth Reddy: మీరు మారరా

  • శాఖల మధ్య సమన్వయమే ఉండదా?.. మీరెలా పని చేస్తున్నారో అర్థమవుతోందా?

  • హైదరాబాద్‌లో ఏ రోడ్డుపై చూసినా చెత్తే.. ఆ పరిస్థితి ఎందుకొచ్చింది?.. ఇదీ నేనే చెప్పాలా?

  • శాఖాధిపతులే అలసత్వంగా వ్యవహరిస్తే ఎలా?.. మెరుగైన వ్యవస్థను తీసుకురావాలి

  • టిమ్స్‌ పనులపై గతంలో చెప్పిన వివరాలే మళ్లీ చెప్తారా?.. క్షేత్రస్థాయిలో ఒక్కసారైనా తిరిగారా?

  • పలు శాఖలపై సమీక్షల్లో అధికారుల మీద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ‘‘హైదరాబాద్‌లో చెత్త సేకరణ, శుభ్రత విషయం కూడా నేనే చెప్పాలా. ఎటు చూసినా రోడ్లపై చెత్త కనబడుతోంది. మీకు కనబడడం లేదా.. అసలు తనిఖీలకు వెళ్తున్నారా.. క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తున్నారా. మీ తీరు ఇకనైనా మార్చుకోండి.. చెత్త నిర్వహణపై తక్షణమే చర్యలు చేపట్టండి. మెరుగైన వ్యవస్థను రూపొందించండి. రోడ్లపై చెత్త కనబడితే చర్యలు తప్పవు’’

‘‘రెండు శాఖల మధ్య సమన్వయం చేసుకోవాలని, కలిసి పనిచేయాలని కూడా నేను చెప్పాలా. అది మీకు తెలియదా. సమీక్షకు వచ్చేటప్పుడు గతంలో ఇచ్చిన నివేదికలనే మళ్లీ తీసుకొస్తారా. ఇదా మీ పనితనం. కీలక అధికారులు వ్యవహరించేది ఇలాగేనా. ఇకనైనా సమన్వయంతో వ్యవహరించి.. పనులు త్వరితగతిన పూర్తి చేయండి’’ ఇటీవల పలు శాఖలపై సమీక్షల సందర్భంగా పలువురు ఐఏఎస్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. మునిసిపల్‌, వైద్య-ఆరోగ్య, ఆర్‌ అండ్‌ బీతోపాటు మరో రెండు, మూడు శాఖలపై ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి వరుస సమీక్షలు నిర్వహించారు. ఆ సమయంలోనే అధికారులు వ్యవహరిస్తున్న తీరు, ఆయాశాఖల్లో అవలంబిస్తున్న విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. ‘‘శాఖలకు అధిపతులుగా మీరే అన్ని అంశాలను గమనించుకుంటూ వెళ్లాలి కదా. మీరే ఇలా అలసత్వంగా, సమన్వయం లేకుండా వ్యవహరిస్తే ఎలా? చెత్త సేకరణ విషయం కూడా నేను చెప్పేదాకా వచ్చిందంటే మీరు ఎలా పని చేస్తున్నారో అర్థమవుతుందా’’ అంటూ చీవాట్లు పెట్టినట్లు సమాచారం. ఇక, సీఎం రేవంత్‌ పర్యవేక్షిస్తున్న మంత్రిత్వ శాఖల అధికారులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినట్లు తెలిసింది. ‘ఏంటి మారరా.. తీరు మార్చుకోండి’ అంటూ ఘాటుగా హెచ్చరించినట్లు సమాచారం.


హైదరాబాద్‌లో చెత్త కనబడకూడదు!

ఇటీవల నిర్వహంచిన సమీక్షలో హైదరాబాద్‌లో ఎటు చూసినా చెత్త కనబడుతోందని, ఆ పరిస్థితి ఎందుకొచ్చిందని ఆ శాఖ ముఖ్య అధికారిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఇక నుంచి హైదరాబాద్‌లో రోడ్లపై చెత్త కనబడకూడదని, ఇప్పుడు అవలంబిస్తున్న విధానం కన్నా మెరుగైన విధానం తీసుకురావాలని ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో లోతుగా అధ్యయనం చేస్తున్నారా? లేదా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. రెండు, మూడు శాఖల సమన్వయంతో సంయుక్తంగా చేపట్టాల్సిన పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని, కనీసం శాఖల మధ్య సమన్వయం చేసుకోలేరా? అని చురకలు అంటిచినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) ఆస్పత్రులు, వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి సంబంధించి అధికారులు సమర్పించిన నివేదికపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సమీక్షలో ఇచ్చిన నివేదికనే మళ్లీ ఇచ్చారని, మరీ ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? ఇప్పటిదాకా ఒక్క సారైనా క్షేత్ర స్థాయిలో పరిశీలించలేదా? అని నిలదీశారు. ఉస్మానియా ఆస్పత్రి పనుల విషయంలో నిర్మాణ స్థలంలో ఉన్న ఓ పెట్రోల్‌ బంకును ఖాళీ చేయించి ఆ స్థలాన్ని అలాగే ఉంచడం పట్ల సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని, ఫెన్సింగ్‌ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఆ స్థలం ఖాళీగా ఉండడంతో లీజుకు ఇస్తారేమోనని కొందరు పైరవీలు చేయిస్తున్నారని ప్రస్తావించారు. తక్షణమే ఆ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆర్‌ అండ్‌ బీ, వైద్యారోగ్య శాఖల మధ్య సమన్వయం కొరవడిందని, నిర్మాణ పనులు, యంత్రాలు అమర్చే పనుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. ఆస్పత్రిలో ఆపరేషన్‌ థియేటర్లు, ఇతరత్రా యంత్రాలు బిగించేందుకు ముందుగానే నిర్మాణాలు చేపట్టాలని, అంతా పూర్తయ్యాక మళ్లీ కూలగొట్టడం, మరమ్మతులు చేయడం మానుకోవాలని సూచించారు. ఆస్పత్రుల్లో యంత్రాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.


తీరు మార్చుకోవాలని సూచించినా..

రాష్ట్రంలో కొందరు ఐఏఎస్‌ అధికారుల తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. తీరు మార్చుకోవాలని, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్య క్రమాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌ సూచిస్తున్నా.. అధికారులు ఏమాత్రం మారడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా హడావుడి చేయడం తప్పి తే.. ఆ తర్వాత వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు సీఎం, మరోవైపు సీఎస్‌, సీఎంవో అధికారులు ఎన్ని సూచనలు చేస్తున్నా.. అటు కలెక్టర్లు, ఇటు రాష్ట్రస్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. కొన్ని శాఖల సమీక్షల సందర్భంగా అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం గురించి స్వయంగా సీఎం మాట్లాడుతుంటే మిగిలిన అధికారులంతా ఇదంతా ఎప్పుడు జరిగిందన్నట్టుగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. పనితీరు మార్చుకోని అధికారులపై బదిలీ వేటు వేస్తున్నా.. వారి తీరు మారకపోవడం గమనార్హం.

Updated Date - Oct 26 , 2025 | 06:03 AM