Emotional Bond With Seethakka: ఈ బంధం నిర్వచించలేనిది
ABN , Publish Date - Aug 10 , 2025 | 03:16 AM
రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, మాజీ మంత్రి గీతారెడ్డి
సీతక్కతో నా అనుబంధం ప్రతి రాఖీ పండుగ రోజు మరింతగా వికసిస్తుంది
ఎక్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగం
సీఎంకు, ఆయన మనుమడికి రాఖీలు కట్టిన సీతక్క
సీఎంకు రాఖీ కట్టిన కొండా సురేఖ, గీతారెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, మాజీ మంత్రి గీతారెడ్డి రాఖీలు కట్టారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లి ఆయన నుదుటన తిలకం దిద్ది రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు, బ్రహ్మకుమారీ సంస్థలకు చెందిన మహిళలు రాఖీ కట్టేందుకు తరలిరావడంతో సీఎం నివాసం సందడిగా మారింది. మంత్రి సీతక్క సీఎం మనుమడికి కూడా రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సీతక్కకు రేవంత్ నూతన వస్త్రాలు బహూకరించారు. అనంతరం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘అక్షరాలతో రచించలేనిది.. మాటలతో నిర్వచించలేనిది.. సీతక్కతో నా అనుబంధం! ప్రతి రాఖీ పౌర్ణమి రోజు ఆ బంధం మరింతగా వికసిస్తూనే ఉంటుంది’’ అని రేవంత్ పోస్టు పెట్టారు. కాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్‌కు కూడా సీతక్క రాఖీలు కట్టారు. మంత్రి తుమ్మలకు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బ్రహ్మకుమారీలు రాఖీ కట్టారు. ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మహిళా కానిస్టేబుళ్లు రాఖీలు కట్టారు. గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నంకు మహిళా కార్యకర్తలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కాగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో మహిళా నేతలు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ విదేశీ వస్తువులకు స్వస్తి పలికి స్వదేశీ ఉత్పత్తులను మరింతగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణకు చెందిన విద్యార్థినులు రాష్ట్రపతి ముర్ముకు రాఖీ కట్టారు. రాష్ట్రపతిభవన్ ఆహ్వానం మేరకు దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల నుంచి 31 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి హైదరాబాద్ మలక్‌పేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు శశినందిత, హర్షిత, రాధిక, భవాని.. పెద్దపల్లి జిల్లా అంతర్గావ్ కేజీబీవీ విద్యార్థులు అమూల్య, అక్షర, ఈ. సహస్ర, సౌమ్య, బి.సహస్రతోపాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తనకు రాఖీ కట్టిన బాలికలకు ముర్ము శుభాకాంక్షాలు తెలిపారు. వారికి బహుమతులు అందించారు.