Share News

CM Revanth Reddy : మార్చి నెలాఖరుకు మెట్రో డీపీఆర్‌లు సిద్ధం

ABN , Publish Date - Jan 08 , 2025 | 05:07 AM

ఫ్యూచర్‌ సిటీ, శామీర్‌పేట్‌, మేడ్చల్‌లో మెట్రో మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు) మార్చి నెలాఖరు లోపు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

CM Revanth Reddy : మార్చి నెలాఖరుకు మెట్రో డీపీఆర్‌లు సిద్ధం

శామీర్‌పేట్‌-మేడ్చల్‌ మెట్రోల ప్రారంభ స్టేషన్‌ వద్ద భారీ కూడలి

హెచ్‌జీసీఎల్‌ ఆధ్వర్యంలో రేడియల్‌ రోడ్ల నిర్మాణం: సీఎం రేవంత్‌రెడ్డి

మెట్రో, ఎలివేటెడ్‌ కారిడార్లు, రేడియల్‌ రోడ్లపై ఉన్నతాధికారులతో సమీక్ష

హైదరాబాద్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఫ్యూచర్‌ సిటీ, శామీర్‌పేట్‌, మేడ్చల్‌లో మెట్రో మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు) మార్చి నెలాఖరు లోపు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. శామీర్‌పేట్‌, మేడ్చల్‌ మెట్రోలు ఒకేసారి ప్రారంభమయ్యేలా చూసుకోవాలని, అధునాతన వసతులతో భారీ కూడలి ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు ప్రతి పనికి నగరంలోకి రావాల్సిన అవసరం లేకుండా అన్నీ అక్కడే అందుబాటులో దొరికేలా కూడలిని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. మూడు మెట్రోల డీపీఆర్‌లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది ఏప్రిల్‌ నెలాఖరుకు టెండర్లు పిలవాలని సీఎం సూచించారు. హైదరాబాద్‌ నగరంలో మెట్రో విస్తరణ, రేడియల్‌ రోడ్ల నిర్మాణాలు, ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణాలపై సీఎం మంగళవారం తన నివాసంలో పురపాలక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం- ఫ్యూచర్‌ సిటీ మెట్రో (40 కి.మీ), జేబీఎ్‌స-శామీర్‌ పేట మెట్రో (22కి.మీ), ప్యారడైజ్‌ -మేడ్చల్‌ మెట్రో (23కి.మీ) మార్గాలకు సంబంధించిన భూసేకరణ వెంటనే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కాగా ఎలివేటెడ్‌ కారిడార్ల విషయంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు. అలైన్‌మెంట్‌ రూపొందించే సమయంలో క్షేత్ర స్థాయిలో సమగ్ర పరిశీలన చేయాలని, మేడ్చల్‌ మార్గంలో ఇప్పటికే ఉన్న మూడు ప్లైఓవర్‌లను పరిగణనలో ఉంచుకుని మెట్రో లైన్‌ తీసుకెళ్లాలని చెప్పారు. ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణ పనులు వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ కింద రేడియల్‌ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం చెప్పారు. సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాస రాజు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌ రెడ్డి, పురపాలక శాఖ అధికారులు పాల్గొన్నారు.

కొత్త క్రిమినల్‌ చట్టాలపై హ్యాండ్‌ బుక్‌ ఆవిష్కరణ

తెలంగాణ జైళ్ల శాఖ రూపొందించిన కొత్త క్రిమినల్‌ చట్టాలపై హ్యాండ్‌ బుక్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా, ఇతర ఉన్నతాధికారులు సీఎం రేవంత్‌ రెడ్డిని ఆయన నివాసంలో మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా సహకారంతో జైళ్ల శాఖ రూపొందించిన హ్యాండ్‌ బుక్‌ను సీఎం ఆవిష్కరించారు. జైళ్ల శాఖ రూపొందించిన 2025 క్యాలెండర్‌, డైరీని సీఎం ఆవిష్కరించారు. ఐజీలు రాజేశ్‌, మురళీ బాబు, డీఐజీలు డి. శ్రీనివాస్‌, సంపత్‌ ఇతర అధికారులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.


వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు

రవాణా శాఖ మంత్రుల భేటీలో మంత్రి పొన్నం

న్యూఢిల్లీ, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : ఈ ఏడాది మే మొదటి వారంలో తెలంగాణలో వాహన్‌ సారథిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ అధ్యక్షతన 42వ రవాణా అభివృద్ధి మండలి సమావేశం జరిగింది. దీంట్లో అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు పాల్గొన్నారు. ఇందులో మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రవాణా శాఖ అమలు చేస్తున్న విధానాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం గడువు తీరిన వాహనాలను తుక్కుగా మార్చే పాలసీ, విద్యుత్‌ వాహనాల పాలసీ తీసుకొచ్చినట్లు తెలిపారు. విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు 100 శాతం రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి ‘వెహికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌’ అమలుచేస్తున్నట్లు తెలిపారు. మేడ్చల్‌ ప్రాంతంలో 40 ఎకరాల ప్రభుత్వ భూమిని రవాణా శాఖ సేకరించిందని, అందులో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు.

Updated Date - Jan 08 , 2025 | 05:07 AM