Revanth Reddy: మారకపోతే మార్చురీకే
ABN , Publish Date - Mar 13 , 2025 | 04:53 AM
‘పదేళ్ల పాటు ప్రజలు నీకు స్టేచర్ ఇచ్చారు... కానీ, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి నాశనం చేసినందుకు గత ఎన్నికల్లో స్ర్టెచర్‌పైకి తీసుకువచ్చారు.

ఇప్పటికే స్టేచర్ నుంచి స్ట్రెచర్‌కు వచ్చావు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ ఇచ్చావు
పదేళ్లలో 7 లక్షల కోట్ల అప్పులు చేశావు
నేనెందుకు దిగాలి? నీ ఫాంహౌస్ గుంజుకున్నానా?.. కేసీఆర్‌పై సీఎం ధ్వజం
కొత్త లెక్చరర్లకు నియామక పత్రాలు
హైదరాబాద్, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ‘పదేళ్ల పాటు ప్రజలు నీకు స్టేచర్ ఇచ్చారు... కానీ, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి నాశనం చేసినందుకు గత ఎన్నికల్లో స్ర్టెచర్‌పైకి తీసుకువచ్చారు. అయినా తీరు మారకపోతే రేపు మార్చురీకి పంపిస్తారు’’ అని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 60-70 ఏళ్ల క్రితం మేం కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ నిటారుగా, పటిష్ఠంగా ఉంటే.. లక్ష కోట్లు అప్పు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, కూలడం జరిగిపోయిందని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బుధవారం జరిగిన కార్యక్రమంలో నూతనంగా నియమితులైన 1532 మంది అధ్యాపకులకు సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ పదేళ్లలో రూ.7లక్షల కోట్లు అప్పులు చేసిండు. ప్రాజెక్టుల పేరిట కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు చేసుకుని కమీషన్లు తీసుకున్నడు.. ఆఖరుకు వారికి రూ.42వేల కోట్ల బకాయిలు పెట్టిండు. ఆయన గారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ ఇచ్చిపోయిండు.. అయినా కోలుకుని ఏదో రకంగా చేస్తుంటే.. దిగిపో అంటున్నారు. నేనెందుకు దిగిపోవాలి.. నేనేమైనా వాళ్ల ఫాంహౌస్ గుంజుకున్నానా? పాలించమని ప్రజలకు మాకు ఐదేళ్లు గడువు ఇచ్చారు. ఈరోజు మీకు నియామక పత్రం ఇస్తున్నం.. వచ్చే ఏడాది దిగిపో అంటే ఊరుకుంటారా? బీఆర్‌ఎస్ వాళ్ల బాధ ఏందో తెలియడం లేదు. నన్ను పని చేయకుండా అడ్డుకుంటున్నారు. నా పరిస్థితి ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ అన్నట్టుగా ఉంది. క్యాన్సర్ ముదిరిపోతుంటే ఎన్ని రోజులు కప్పిపుచ్చుకోవాలి?’’ అని ప్రశ్నించారు. ప్రతి నెలా ప్రభుత్వానికి రూ.18500 కోట్ల ఆదాయం వస్తుండగా, అందులో ఉద్యోగుల జీతభత్యాలకు రూ.6500 కోట్లు, నాడు అయ్యగారు చేసిన అప్పులకు రూ.6500 కోట్లు కట్టాల్సి వస్తోందని తెలిపారు. మిగతా రూ.5వేల కోట్లను సంక్షేమ పథకాలు, పలు ప్రాజెక్టులకు వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ఉన్న పథకాలన్నీ అమలు చేయాంటే ప్రతినెలా రూ. 9వేల కోట్లు తక్కువ పడుతున్నాయని చెప్పారు. అందుకే ఒకనెల ఆశా వర్కర్లకు, ఇంకో నెల అంగన్‌వాడీ వర్కర్లకు జీతాలు ఆపుతున్నామని, లేదంటే షాదీముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలను పెండింగ్‌లో పెడుతున్నామని అన్నారు. ఒక నెల ఇంటి కిరాయి ఇచ్చేసి పాలోడికి, స్కూలు ఫీజులు ఆపినట్టు ఇలా రొటేషన్ పనే జరుగుతోందన్నారు.
ఒక్కో విద్యార్థిపై ఏడాదికి లక్ష ఖర్చు
పదేళ్లలో విద్యా శాఖ నిర్లక్ష్యానికి గురైందని, కేరళతో పోటీపడుతూ తొలి మూడు స్థానాల్లో ఉండాల్సిన రాష్ట్రం.. నేడు చివరి నుంచి మూడో స్థానంలో ఉందని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలలు గొప్పవా? ఎందుకు పోటీ పడట్లేదు? లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బోధనను ఉద్యోగంలా కాకుండా భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే బాధ్యతగా భావించాలని నియామక పత్రాలు అందుకున్న అధ్యాపకులకు సూచించారు. ‘‘ప్రైవేటు బడుల్లో విద్యార్థి చదువు కోసం ప్రతి కుటుంబం ఏడాదికి రూ.20వేలు ఖర్చు చేస్తుంటే.. ప్రభుత్వం లక్ష వరకు ఖర్చు చేస్తోంది. దీనిని ఖర్చు కాకుండా భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తున్నాం. కానీ ఖర్చుకు తగ్గట్టు ఫలితాలు రావట్లేదు. దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంది’’ అని అన్నారు. విద్యారంగంలో సంస్కరణలకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తుందన్నారు.
సీఎంగా నాకు దక్కే గొప్ప సంతృప్తి అదే
‘‘బిడ్డా.. కొలువు వచ్చిందా. అని ఆశగా అడిగే తల్లికి.. అమ్మా.. నీ రక్తం చెమటగా మార్చి చేసిన త్యాగం ఫలించిందే.. అని నువ్వు చెప్పినప్పుడు ఆ అమ్మ కళ్లల్లో ఉప్పొంగే ఆనందమే ముఖ్యమంత్రిగా నాకు దక్కే గొప్ప సంతృప్తి’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రవీంద్రభారతిలో నూతన అధ్యాపకులకు నియామకపత్రాలు అందించిన అనంతరం ‘ఎక్స్’ ఖాతాలో ఈ మేరకు ఆయన పోస్టు చేశారు.