Cinema workers votes: సినీ కార్మికుల ఓటు ఎటు
ABN , Publish Date - Oct 24 , 2025 | 06:53 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. స్టార్ క్యాంపెయినర్లు హోరెత్తిస్తున్నారు.
జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లో 22 వేలకుపైగా సినీ కార్మికుల ఓట్లు.. కీలకంగా సినీ యూనియన్లు
ముగ్గురు అభ్యర్థులతోనూ వారికి సత్సంబంధాలు
కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల ప్రయత్నాలు
ఎవరికి మద్దతనే దానిపై యూనియన్ల నేతల తర్జనభర్జన
బంజారాహిల్స్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. స్టార్ క్యాంపెయినర్లు హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో గంపగుత్తగా వచ్చే ఓట్లపై అన్ని పార్టీలు దృష్టిపెట్టాయి. ఈ క్రమంలో సినీ కార్మికులు కీలకంగా మారారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూస్‌ఫగూడ డివిజన్‌లో కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ, రహమత్‌నగర్ డివిజన్ పరిధిలో.. 24 క్రాఫ్టులకు చెందిన సినీ కళాకారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారికి సంబంధించి సుమారు 22 వేల ఓట్లు ఉన్నట్టు అంచనా. ఎన్నికల బరిలో ఉన్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు సినీ రంగంతో సత్సంబంధాలు ఉండటంతో.. సినీ కార్మికులు ఎవరి వైపు మొగ్గు చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీల యత్నాలు..
బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత భర్త మాగంటి గోపీనాథ్ సినీ నిర్మాత కూడా. ఆయనకు సినీ కార్మిక సంఘాలతో మొదటి నుంచీ మంచి సంబంధాలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా గెలిచాక సినీ పరిశ్రమలో ఎవరికి సమస్య వచ్చినా మాగంటిని ఆశ్రయించేవారు. చిత్రపురి కాలనీ అంశంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు కార్మికుల్లో చాలా వరకు బీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపించారని లెక్కలు చెబుతున్నాయి. ఈ సారి కూడా వారి ఓట్లు సాధించుకునేందుకు బీఆర్‌ఎస్ నేతలు కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ కుటుంబానికి సినీ పరిశ్రమతో మంచి సంబంధాలు ఉన్నాయి. కృష్ణానగర్ ఏర్పాటులో నవీన్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ కీలకంగా వ్యవహరించారు. కొంతకాలం సినిమా రంగానికి చెందిన పలు యూనియన్లకు పెద్ద దిక్కుగా వ్యవహరించారు. చిత్రపురికాలనీ ఏర్పాటులోనూ నటుడు ప్రభాకర్‌రెడ్డితో కలిసి కృషి చేశారనే పేరుంది. అంతేకాదు తన కుమారుడికి మద్దతివ్వాలని సినీ కార్మికులకు చిన్న శ్రీశైలం యాదవ్ ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. సినీ నటుడు సుమన్ అయితే చిన్న శ్రీశైలం యాదవ్‌తో కలసి ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి ఇంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు సినీ పరిశ్రమతో మంచి సంబంధాలు నెరిపారు. కొన్ని సినిమాలకు స్నేహితులతో కలిసి ఫైనాన్స్ కూడా చేశారు. కార్మికుల యూనియన్లతోనూ టచ్‌లో ఉన్నారు.
కీలకంగా మారిన సినీ యూనియన్లు
ముగ్గురు ప్రధాన అభ్యర్థులకు సినీ కార్మికులతో సంబంధం ఉండటంతో ఎవరికి ఓటేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో 24 క్రాప్టులకు చెందిన యూనియన్లు కీలకంగా మారాయి. అభ్యర్థులు ఇప్పటికే ఆయా యూనియన్ నేతలతో సంప్రదింపులు జరిపి, తమకు మద్దతు తెలపాలని, యూనియన్‌లోని కార్మికులతో ఓట్లు వేయించాలని కోరినట్లు తెలిసింది. కానీ ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై యూనియన్ల నేతలు తర్జనభర్జన పడుతున్నారని, ఎవరికి మద్దతిస్తే ఎలాంటి లాభనష్టాలు ఉంటాయని బేరీజు వేసుకుంటున్నారని సమాచారం.