క్రీస్తు సాక్షాత్కార ఉత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:39 AM
నల్లగొండ జిల్లా కేతేపల్లిలోని జపమాల మాత చర్చిలో క్రీస్తు సాక్షాత్కార ఉత్సవాలు(ముగ్గురు రాజుల పండుగ) సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

కేతేపల్లి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా కేతేపల్లిలోని జపమాల మాత చర్చిలో క్రీస్తు సాక్షాత్కార ఉత్సవాలు(ముగ్గురు రాజుల పండుగ) సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను ఈ ఏడాది రెండు రోజులకు కుదించారు. పండుగ సందర్భంగా చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపైనిర్వహించిన ప్రార్థనలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల చర్చిలకు చెందిన విచారణ గురువులు, మతకన్యలు, క్రీస్తు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పూజా కార్యక్రమాలు సీనియర్ మతగురువు క్రీస్తురాజు ఆధ్వర్యంలో సాగాయి. ముగ్గురు రాజుల మహోత్సవానికి క్రైస్తవంలో ప్రత్యేకత ఉందన్నారు. పరుల కొరకు పుట్టిన ఏకైక దేవుడు ఏసుక్రీస్తు అని కొనియాడారు. ఏసుక్రీస్తు ప్రేమానుభూతిని ప్రతి క్రైస్తవుడూ ఆస్వాదించాలని కోరారు. అట్టడుగున ఉన్నవారిని అభివృధ్దిలోకి తీసుకొచ్చేందుకు ప్రతి వారు తోడ్పాటు అందించాలన్నారు. ప్రజల కోసం తన రక్తాన్ని చిందించిన ఏసు ప్రభువు లోకరక్షకుడని కొనియాడారు. క్రీస్తు మార్గంలో ప్రతివారు పయనించాలన్నారు. స్థానిక చర్చి ఫాదర్ ఎం. ప్రాన్సీస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో చర్చి కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. చర్చి ఎదుట గల సర్వీసు రోడ్డు వెంట తిరునాళ్లలో రకరకాల దుకాణాలు ఏర్పాటు చేశారు. పిల్లల ఆట వస్తువులు, మహిళల అలంకరణ సామాగ్రి, తినుబండారాలు తదితర దుకాణాలతో చర్చి పరిసరాలు నిండిపోయాయి.