Share News

చర్లపల్లిలో రెగ్యులర్‌ రైళ్లకు మరో మూడు నెలలు?

ABN , Publish Date - Jan 08 , 2025 | 05:41 AM

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్తగా ప్రారంభమైన చర్లపల్లి శాటిలైట్‌ టెర్మినల్‌ నుంచి ప్రధాన/రెగ్యులర్‌ రైళ్లలో రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు మరో మూడు నెలలు ఆగాల్సిందే.

చర్లపల్లిలో రెగ్యులర్‌ రైళ్లకు మరో మూడు నెలలు?

తిరుపతికి చేరిన తొలి రైలు

హైదరాబాద్‌ సిటీ/కుషాయిగూడ, జనవరి 7(ఆంఽధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్తగా ప్రారంభమైన చర్లపల్లి శాటిలైట్‌ టెర్మినల్‌ నుంచి ప్రధాన/రెగ్యులర్‌ రైళ్లలో రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు మరో మూడు నెలలు ఆగాల్సిందే. ఎందుకుంటే సాంకేతిక కారణాల వల్ల చర్లపల్లి స్టేషన్‌ నుంచి ప్రస్తుతానికి ప్రత్యేక రైళ్లనే నడపనున్నామని రైల్వే శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇప్పటికే (90 రోజులు ముందుగా) సికింద్రాబాద్‌, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి/వరకు వివిధ రైళ్లలో ప్రయాణీకులు రిజర్వేషన్‌ చేయించుకోవడంతో ఆయా రైళ్లను అవే టెర్మినల్స్‌ నుంచి/వరకు మరికొన్నాళ్లు తప్పక కొనసాగించాల్సి ఉంది. దీంతో చర్లపల్లి నుంచి ప్రధాన/రెగ్యులర్‌ రైళ్ల రాకపోకలకు సమయం పట్టనుంది. మరోపక్క, చర్లపల్లి టెర్మినల్‌కు అప్రోచ్‌ రహదారుల విస్తరణపై రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. ఇక, చర్లపల్లి టెర్మినల్‌ నుంచి సోమవారం మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమైన ప్రత్యేక రైలు(07077) మంగళవారం ఉదయం 4గంటలకు తిరుపతికి చేరింది. తిరిగి మంగళవారం రాత్రి 9గంటలకు తిరుపతిలో బయలుదేరిన ఆ రైలు(07078) బుధవారం ఉదయం 8గంటలకు చర్లపల్లి చేరుకోనుంది. దీంతో చర్లపల్లి టెర్మినల్‌ నుంచి ప్రారంభమైన తొలి రైలుగా ఇది రికార్డులకు ఎక్కింది.

నిర్వహణ పనులు.. నెలాఖరు దాకా పలు రైళ్ల రద్దు

నిర్వహణ పనుల కారణంగా జనవరి నెలాఖరు వరకు కొన్ని రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్‌-కాచిగూడ(77601-77602) రైళ్లను జనవరి 8నుంచి 31 వరకు రద్దు చేశారు. మరికొన్ని రైలు సర్వీసులను పాక్షికంగా రద్దు చేశారు. కొన్నింటి షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు.

సంక్రాంతికి నాలుగు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే నాలుగు ప్రత్యేక రైళ్లను మంగళవారం ప్రకటించింది. జనవరి 9న కాకినాడ టౌన్‌-వికారాబాద్‌(07205), 10న వికారాబాద్‌-శ్రీకాకుళంరోడ్‌(07207), 11న శ్రీకాకుళంరోడ్‌-చర్లపల్లి(07208), 12న చర్లపల్లి-కాకినాడటౌన్‌(07206) రైళ్లను నడపనున్నామని వెల్లడించింది.

Updated Date - Jan 08 , 2025 | 05:42 AM