Share News

CM Revanth Reddy: ఢిల్లీ టూర్లతో సీఎం విజయాలు

ABN , Publish Date - May 24 , 2025 | 03:50 AM

హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణానికి అవసరమైన కంటోన్మెంట్‌ భూముల బదలాయింపు నుంచి రాష్ట్ర అవసరాలకు తగిన విధంగా ఐపీఎస్‌ క్యాడర్‌ సంఖ్య పెంపు

CM Revanth Reddy: ఢిల్లీ టూర్లతో సీఎం విజయాలు

  • తెలంగాణకు ఐపీఎస్‌ క్యాడర్‌ పెంపు

  • 2 వేల విద్యుత్‌ బస్సుల కేటాయింపు

  • ఫలితాలనిస్తున్న ఢిల్లీ పర్యటనలు: సీఎంవో

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణానికి అవసరమైన కంటోన్మెంట్‌ భూముల బదలాయింపు నుంచి రాష్ట్ర అవసరాలకు తగిన విధంగా ఐపీఎస్‌ క్యాడర్‌ సంఖ్య పెంపు, రాష్ట్రానికి 2వేల విద్యుత్‌ బస్సుల కేటాయింపు వరకు తెలంగాణ విజ్ఞప్తుల విషయంలో కేంద్రం సానుకూలంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనల నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి చేసిన విజ్ఞప్తుల్లో కొన్నింటికి కేంద్రం పచ్చజెండా ఊపిందని పేర్కొంది. సీఎంవో వివరాల ప్రకారం.. ఇప్పటికే కంటోన్మెంట్‌ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా వ్యవహరించిన కేంద్రం ఆ భూముల బదలాయింపునకు మార్గం సుగమం చేసింది. తాజాగా తెలంగాణ ఐపీఎస్‌ క్యాడర్‌ సంఖ్యను కూడా 139 నుంచి 151కు పెంచుతూ గెజిట్‌ను విడుదల చేసింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు కేటాయించిన ఐపీఎస్‌ అధికారుల సంఖ్య రాష్ట్ర అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదని ప్రధాని మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు సీఎం రేవంత్‌ గతంలో కలిసి వివరించారు. ఆ సమయంలోనే రాష్ట్రానికి అదనంగా 29 ఐపీఎస్‌ పోస్టులు కేటాయించాలని వారికి లే ఖలు రాశారు.


సీఎం విజ్ఞప్తుల పట్ల సుముఖత వ్యక్తం చేసిన కేంద్రం రాష్ట్రానికి 12 ఐపీఎస్‌ క్యాడర్‌ పోస్టులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా, హైదరాబాద్‌ నగర విస్తీర్ణం భారీగా పెరుగుతుండడం, నానాటికీ కాలుష్యం పెరుగుతున్నందున కాలుష్య నివారణతోపాటు ఆధునిక నగర అవసరాలకు తగినట్లు విద్యుత్‌ బస్సులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్‌ పలుమార్లు కోరారు. ఈ ఏడాది జనవరి 16న ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి, ఆ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మలతో సీఎం రేవంత్‌ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా పీఎం ఈ-డ్రైవ్‌ పథకం కింద హైదరాబాద్‌ నగరానికి ఎలక్ర్టిక్‌ బస్సులు కేటాయించాలని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఎలక్ర్టిక్‌ బస్సులతో ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతినకుండా ఉండేలా.. డీజిల్‌ బస్సులను రిట్రోఫిట్మెంట్‌ పద్ధతిలో ఎలక్ర్టిక్‌ బస్సులుగా మార్చాలని కోరారు. ఈ క్రమంలో విద్యుత్‌ బస్సుల కేటాయింపుపై ఉన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఇటీవల 2వేల ఎలక్ర్టిక్‌ బస్సులను కేటాయించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి హైదరాబాద్‌ నగరంలో ఎలక్ర్టిక్‌ బస్సులు రోడ్డెక్కనున్నాయని సీఎం కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - May 24 , 2025 | 03:50 AM