Share News

Godavari-Banakacharla Link Project : గోదావరి-బనకచర్ల అనుసంధానంపై వివరాలు ఇవ్వండి

ABN , Publish Date - Jan 08 , 2025 | 04:24 AM

ఏపీ ప్రభుత్వం చేపట్టదలిచిన గోదావరి-బనకచర్ల అనుసంధాన(లింక్‌) ప్రాజెక్టుపై వివరాలు ఇవ్వాలని గోదావరి, కృష్ణానది యాజమాన్య బోర్డులను కేంద్ర జలశక్తి శాఖ కోరింది. ఈమేరకు మంగళవారం కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) లేఖ రాసింది.

Godavari-Banakacharla Link Project : గోదావరి-బనకచర్ల అనుసంధానంపై వివరాలు ఇవ్వండి

గోదావరి, కృష్ణా బోర్డులకు కేంద్ర జల వనరుల సంఘం లేఖ

హైదరాబాద్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : ఏపీ ప్రభుత్వం చేపట్టదలిచిన గోదావరి-బనకచర్ల అనుసంధాన(లింక్‌) ప్రాజెక్టుపై వివరాలు ఇవ్వాలని గోదావరి, కృష్ణానది యాజమాన్య బోర్డులను కేంద్ర జలశక్తి శాఖ కోరింది. ఈమేరకు మంగళవారం కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) లేఖ రాసింది. గోదావరిలో వరద జలాల ఆధారంగా కోస్తాంధ్ర, రాయలసీమలో 80 లక్షల మందికి తాగునీటితో పాటు 7.41 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించడం, 22.58 లక్షల ఎకరాల స్థిరీకరణ లక్ష్యంతో రూ.80,112 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించింది. అంతేకాకుండా నాగార్జున సాగర్‌ నుంచి కూడా బొల్లాపల్లి అనుసంధానం చేపట్టి, సాగర్‌ కుడి కాలువను విస్తరించి, వరద జలాలను తరలించాలని ఏపీ యోచిస్తోంది. దీనికి ప్రధానమంత్రి కృషి సింఛాయ్‌ యోజన(ఏఐబీపీ) కింద సహాయం అందించాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కాగా కేంద్ర జల వనరుల సంఘం తెలంగాణకు దీనిపై లేఖ రాసి... అభిప్రాయం తీసుకున్న తర్వాత దాన్ని జోడించి కేంద్రానికి పంపించే అవకాశాలున్నాయి. అయితే ఈ ప్రాజెక్టును తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. గోదావరి-బనకచర్ల అనుసంధానంతో పాటు పోలవరం ముంపుపై ఏపీకి సమగ్రంగా లేఖ రాయాలని, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించాలని సీఎం ఆదేశించారు. గోదావరి-బనకచర్ల అనుసంధానంలో సాగర్‌ను వినియోగించడాన్ని ప్రధానంగా తెలంగాణ తప్పు పడుతోంది. తెలంగాణలో గోదావరిపై కడుతున్న ప్రాజెక్టులతో పోలవరం ప్రాజెక్టుపై ప్రభావం పడుతుందని ఏపీ పలుమార్లు లేఖలు రాయడాన్ని కూడా తెలంగాణ తప్పు పడుతోంది. దాంతో గోదావరి, కృష్ణా బోర్డులతో పాటు కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)కి లేఖలు రాయాలని తెలంగాణ నిర్ణయించింది.

Updated Date - Jan 08 , 2025 | 04:24 AM