Share News

Parliament Session: పార్లమెంట్‌ సమావేశాలు మధ్యలోనే ముంగించే యత్నం

ABN , Publish Date - Aug 12 , 2025 | 05:09 AM

పార్లమెంట్‌ సమావేశాలను మధ్యలోనే ముగించాలని కేంద్రం చూస్తోందని కాంగ్రెస్‌ ఎంపీల ఫోరం తెలంగాణ కన్వీనర్‌..

Parliament Session: పార్లమెంట్‌ సమావేశాలు మధ్యలోనే ముంగించే యత్నం

  • కేంద్రం తప్పించుకోవాలనుకుంటోంది

  • తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ సమావేశాలను మధ్యలోనే ముగించాలని కేంద్రం చూస్తోందని కాంగ్రెస్‌ ఎంపీల ఫోరం తెలంగాణ కన్వీనర్‌ మల్లు రవి చెప్పారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 21 వరకు పార్లమెంట్‌ సమావేశాలు జరగాల్సి ఉన్నా మంగళవారమే సమావేశాలు ముగిసే అవకాశం ఉందన్నారు. ఎన్నికల కమిషన్‌, ఎస్‌ఐఆర్‌ తదితర అంశాలపై చర్చించకుండా కేంద్రం తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇండియా కూటమి ఎంపీలు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే అరెస్టు చేయడం అప్రజాస్వామికమని చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అక్రమ మార్గంలోనే బీజేపీ గెలిచిందని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఆరోపించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌లోనూ దొంగ ఓట్లతోనే గెలిచారా అనే సందేహం కలుగుతోందని ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆరోపించారు. ఇండియా కూటమి ఎంపీలు బయట ఆందోళన చేస్తుంటే, ఇదే అదునుగా భావించి సభలో బిల్లులను ఆమోదించారని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి చెప్పారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ చెప్పారు.

విచారణ జరిపించాలి: మహేశ్‌ గౌడ్‌

ఓట్‌ చోరీపైన సమగ్ర విచారణ జరిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై ఆందోళన చేస్తున్న ఎంపీలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. రాహుల్‌గాంధీ వాస్తవాలు మాట్లాడితే జీర్ణించుకోలేక, నిరసన తెలిపే హక్కునూ బీజేపీ కాలరాస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. ఇండియా కూటమి నేతల అరెస్టు నేపథ్యంలో బ్లాక్‌ డేగా పరిగణించాలని ట్రైకార్‌ చైర్మన్‌ బెల్లయ్య నాయక్‌ చెప్పారు. ఎన్నికల సంఘాన్ని రాహుల్‌ ప్రశ్నిస్తుంటే బీజేపీ ఎందుకు ఉలిక్కి పడుతోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రశ్నించారు.

Updated Date - Aug 12 , 2025 | 05:09 AM