Share News

Allied Healthcare: హెల్త్‌కేర్‌ కోర్సులకు కొత్త సిలబస్‌ తప్పనిసరి

ABN , Publish Date - Aug 23 , 2025 | 04:21 AM

అలైడ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొఫెషన్స్‌’లో దేశమంతా ఒకేరీతి విద్యా ప్రమాణాలు పాటించాలనే ఉద్దేశంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ అలైడ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొఫెషన్స్‌(ఎన్‌సీఏహెచ్‌పీ) శుక్రవారం ఓ ఉత్తర్వు జారీ చేసింది.

Allied Healthcare: హెల్త్‌కేర్‌ కోర్సులకు కొత్త సిలబస్‌ తప్పనిసరి

  • దేశమంతా ఒకేరీతి విద్యా ప్రమాణాలే లక్ష్యం

  • వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు

  • రాష్ట్రాలకు ఎన్‌సీఏహెచ్‌పీ ఆదేశం

హైదరాబాద్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ’అలైడ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొఫెషన్స్‌’లో దేశమంతా ఒకేరీతి విద్యా ప్రమాణాలు పాటించాలనే ఉద్దేశంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ అలైడ్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొఫెషన్స్‌(ఎన్‌సీఏహెచ్‌పీ) శుక్రవారం ఓ ఉత్తర్వు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న డీమ్డ్‌ విశ్వ విద్యాలయాలు, అనుబంధ కళాశాలలన్నీ 2026-27 విద్యా సంవత్సరంలో కొత్త సిలబ్‌సను తప్పనిసరిగా అనుసరించాలని అందులో పేర్కొంది.ఫిజియో థెరపీ, ఆప్టోమెట్రీ, డయాలసిస్‌ థెరపీ, హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌, మెడికల్‌ రేడియాలజీ అండ్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ, రేడియోథెరపీ టెక్నాలజీ, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ, అప్లైడ్‌ సైకాలజీ, బీహేవియరల్‌ సైన్స్‌, ఫిజీషియన్‌ ఆసోసియేట్‌, న్యూట్రీషన్‌ అండ్‌ డైటెటిక్స్‌ వంటి పది కొత్త పాఠ్య ప్రణాళికలను ఎన్‌సీఏహెచ్‌పీ ఇటీవల సిలబస్‌ చేర్చింది.


ఈ ఒకే పాఠ్య ప్రణాళికను దేశమంతా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే ప్రతీ విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ లేదా బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ను ఏర్పాటు చేసి విద్యా ప్రణాళిక అమలుపై పర్యవేక్షించాలని ఆదేశించింది. ఇక రాష్ట్రస్థాయిలో ఇప్పటికే ఉన్న హెల్త్‌ కేర్‌ కౌన్సిల్‌ ఈ సిలబస్‌ అమలు పర్యవేక్షణ బాధ్యత చూసుకోవాలని సూచించింది. ఒకవేళ కౌన్సిల్‌ ఏర్పాటు కాని రాష్ట్రాల్లో మాత్రం ఆరోగ్యశాఖే ఆ బాధ్యత తీసుకోవాలని కోరింది. 45 రోజుల్లోగా యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌(ఏటీఆర్‌)ను సమర్పించాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కమిషన్‌ గడువు విధించింది.

Updated Date - Aug 23 , 2025 | 04:21 AM