Railway Project: తెలంగాణకు కొత్త రైలు మార్గం..
ABN , Publish Date - Aug 29 , 2025 | 05:16 AM
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కొత్త రైల్వే ప్రాజెక్టును మంజూరు చేసింది. సికింద్రాబాద్ (సనత్‌నగర్)- వాడి మార్గంలో 173 కి.మీ. పొడవైన 3, 4వ లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
‘సికింద్రాబాద్-వాడి’కి కేంద్రం ఓకే
రూ.5 వేల కోట్లతో 3, 4 లైన్ల నిర్మాణం
రూ.12,328 కోట్లతో దేశంలో 4 రైల్వే ప్రాజెక్టులు
వీధి వ్యాపారులకు 2030 దాకా ‘పీఎం స్వనిధి’
రుణ పరిమితులు రూ.5 వేల చొప్పున పెంపు
కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు
సికింద్రాబాద్-వాడి రైల్వే మార్గానికి ఓకే
న్యూఢిల్లీ, ఆగస్టు 28: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కొత్త రైల్వే ప్రాజెక్టును మంజూరు చేసింది. సికింద్రాబాద్ (సనత్‌నగర్)- వాడి మార్గంలో 173 కి.మీ. పొడవైన 3, 4వ లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చే రూ.12,328 కోట్ల విలువైన నాలుగు కొత్త రైల్వే ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సికింద్రాబాద్-వాడి మార్గం నిర్మాణానికి కేంద్రం రూ.5012 కోట్లు వెచ్చించనుంది. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి కానుంది. ‘ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర నిధి (పీఎం స్వనిధి)’ పథకం పునర్నిర్మాణం, పొడిగింపునకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.7332 కోట్లతో చేపట్టిన ఈ పథకాన్ని మార్చి 31, 2030 వరకు పొడిగించేందుకు ఆమోదముద్ర వేసింది.
పథకంలో భాగంగా తొలి విడతలో ఇచ్చే రుణ పరిమితిని రూ.10 వేల నుంచి 15 వేలకు పెంచారు. రెండో విడతలో ఇచ్చే రుణ పరిమితిని కూడా రూ.20 వేల నుంచి 25 వేలకు పెంచారు. మూడో విడత రుణపరిమితి రూ.50 వేలను మాత్రం మార్చలేదు. అలాగే చిల్లర, టోకు వ్యాపార లావాదేవీల్లో డిజిటల్ చెల్లింపులను ఎంచుకునే వీధి వ్యాపారులకు రూ.1600 ప్రోత్సాహక నగదు అందించనున్నట్లు వివరించింది. కాగా, 2030లో కామన్వెల్త్ క్రీడా పోటీలను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించేందుకు బిడ్ వేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో చివరిసారిగా 2010లో కామన్వెల్త్ పోటీలను నిర్వహించారు.