CBI Court Issues: వివేకా హత్య కేసులో నిందితులకు సీబీఐ కోర్టు నోటీసులు
ABN , Publish Date - Oct 24 , 2025 | 06:21 AM
ఏపీ మాజీ సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ‘తదుపరి దర్యాప్తు’నకు.....
‘తదుపరి దర్యాప్తు’పై అభిప్రాయాలు చెప్పాలని ఆదేశం
దర్యాప్తు అసంపూర్ణమంటూ సునీత పిటిషన్
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఏపీ మాజీ సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ‘తదుపరి దర్యాప్తు’నకు సంబంధించి వివరణ ఇవ్వాలని నిందితులకు సీబీఐ కోర్టు నోటీసులు పంపించింది. నిందితులుగా ఉన్న టీ గంగిరెడ్డి, సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి (అప్రూవర్), దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిలతోపాటు ప్రతివాదిగా ఉన్న సీబీఐకి నాంపల్లి సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి డాక్టర్ టీ రఘురాం ఆదేశాలు జారీచేశారు. తన తండ్రి హత్యకు సంబంధించి ఇంకా వెలుగు చూడాల్సిన అనేక విషయాలు ఉన్నాయని, సీబీఐ లోతుగా దర్యాప్తు చేయకుండా వదిలేసిందని పేర్కొంటూ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఇది విచారణకు వచ్చింది.
పిటిషనర్ తరఫున న్యాయవాది ఎస్ గౌతమ్ వాదనలు వినిపిస్తూ ‘తదుపరి దర్యాప్తు’ చేయాలన్న తమ పిటిషన్‌ను విచారణార్హత (మెయింటెనబులిటీ) పేరిట తిరస్కరించరాదని సుప్రీంకోర్టు నిర్దేశించిన విషయాన్ని గుర్తుచేశారు. అందరి వాదనలు విని 8 వారాల్లో ఈ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిందని తెలిపారు. వాస్తవానికి తదుపరి దర్యాప్తు చేయాలి అనే విషయం బాధితురాలైన సునీతకు, సీబీఐకి మధ్య ఉన్న అంశమని, దీనిపై నిందితుల వాదన వినాల్సిన అవసరం లేదని తెలిపారు. అయినప్పటికీ అందరివాదన విని నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొనడంతో నిందితులందరికీ కాపీలు అందజేశామని పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు.. సుప్రీంకోర్టు సమయం నిర్దేశించిన నేపథ్యంలో ఈనెల 27లోపు కౌంటర్‌లు దాఖలు చేయాలని నిందితులు, సీబీఐకి ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. మరోవైపు వివేకా హత్యకు సంబంధించిన ప్రధాన కేసు సైతం గురువారం విచారణకు వచ్చింది. ఈ విచారణకు నిందితులు గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి హాజరుకాగా మిగతా వారు రాలేదు. తదుపరి విచారణ నవంబర్ 10కి వాయిదా పడింది.