Sabitha Indra Reddy: సబితా ఇంద్రారెడ్డి, కృపానందం నిర్దోషులు కారు
ABN , Publish Date - Aug 19 , 2025 | 03:33 AM
ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో వివరణ ఇవ్వాలని పేర్కొంటూ అప్పటి గనులశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,...
హైకోర్టులో సీబీఐ వాదన
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో వివరణ ఇవ్వాలని పేర్కొంటూ అప్పటి గనులశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అప్పటి పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి కృపానందానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓఎంసీ కేసులో ఏ-8గా ఉన్న కృపానందం, ఏ-9గా సబితా ఇంద్రారెడ్డిలపై కేసు రుజువుకాకపోవడంతో వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ కోర్టు మే 6న తీర్పు ఇచ్చింది. వారిని నిర్దోషులుగా ప్రకటించడం చెల్లదంటూ సీబీఐ హైకోర్టులో క్రిమినల్ అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. వారిద్దరికీ నోటీసులు జారీచేసింది. ఓఎంసీ కేసులో దోషులుగా తేలిన గాలి జనార్ధన్‌రెడ్డి, ఇతర నిందితులు ఇప్పటికే హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. ఆ అప్పీళ్లకు ప్రస్తుత కేసును జత చేయాలని ధర్మాసనం పేర్కొంది.తదుపరి విచారణ వచ్చేనెలకు వాయిదా పడింది.