Share News

Farmer Protest: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రైతుపై కేసు

ABN , Publish Date - Sep 06 , 2025 | 04:31 AM

సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రైతుపై కేసు నమోదైంది. ఈనెల 4న యూరియా కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్యాక్స్‌ గోదాం వద్దకు వెళ్లిన రైతు లక్ష్మణ్‌, అక్కడ భారీగా క్యూ ఉండడంతో అసహనం వ్యక్తం చేశాడు.

Farmer Protest: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రైతుపై కేసు

  • నిరసన తెలిపిన రైతులు, బీఆర్‌ఎస్‌ నాయకులు

  • నిరసన తెలపడం రాజ్యాంగ హక్కు: కేటీఆర్‌

  • రైతును వేధించడం దుర్మార్గం: కల్వకుంట్ల కవిత

ఎల్లారెడ్డిపేట, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రైతుపై కేసు నమోదైంది. ఈనెల 4న యూరియా కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్యాక్స్‌ గోదాం వద్దకు వెళ్లిన రైతు లక్ష్మణ్‌, అక్కడ భారీగా క్యూ ఉండడంతో అసహనం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఆయన సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై స్థానిక కాంగ్రెస్‌ నాయకులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం శుక్రవారం రైతు ఇంటికి వెళ్లారు. విషయం తెలుసుకున్న రైతులు, బీఆర్‌ఎస్‌ నాయకులు పెద్ద సంఖ్యలో ఠాణాకు చేరుకుని రైతుకు మద్దతుగా నిరసన తెలిపారు. యూరియా సరఫరా కావడం లేదని ఆవేశంలో మాట్లాడిని ఓ సాధారణ రైతుపై కేసు పెట్టడం అన్యాయమని వారు వాదించారు.


ఈ ఘటనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎక్స్‌వేదికగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దేశానికే అన్నంపెట్టే రైతుపై అక్రమ కేసు బనాయించడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమని కేటీఆర్‌ అన్నారు. యూరియా దొరక్క కళ్లముందే పంట ఎండిపోవడంతో ఆక్రోశంలో మాట్లాడిన రైతుపై కక్షగట్టి పోలీసులను అతడి ఇంటిపైకి పంపించి భయభ్రాంతులకు గురిచేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. లక్ష్మణ్‌కు రక్షణగా బీఆర్‌ఎస్‌ పోరాడుతుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డిని నిలదీసిన రైతును వేధించడం దుర్మార్గమని కవిత మండిపడ్డారు.

Updated Date - Sep 06 , 2025 | 04:31 AM