Cabinet Discusses: రోడ్డున పడొద్దు
ABN , Publish Date - Oct 24 , 2025 | 03:58 AM
మంత్రుల మధ్య సఖ్యత కొరవడడంపై రాష్ట్ర క్యాబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది! చిన్నపాటి అంశాల్లో విభేదాలతో....
అనవసర విషయాలకు రాద్ధాంతం వద్దు.. ప్రజలు, ప్రతిపక్షాల్లో చులకన కావొద్దు
సంఘటితంగా ఉందాం.. జరిగిందంతా టీ కప్పులో తుపానే
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి, స్థానిక ఎన్నికలకు వెళ్దాం
మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు సీఎం రేవంత్ హితవు
‘స్థానికం’పై ఏం చేద్దాం?.. అభిప్రాయాలు అడిగిన సీఎం
హైకోర్టు స్పందన కోసం వేచిచూద్దామన్న అమాత్యులు
మీడియా సమావేశంలో కలిసి కూర్చున్న కొండా, పొంగులేటి!
మా అమ్మాయి వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నా ముఖ్యమంత్రి రేవంత్‌పై ఆవేశంలో మాట్లాడింది
మాదంతా ఒకే కుటుంబం.. సర్దుకుపోయాం: మంత్రి సురేఖ
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): మంత్రుల మధ్య సఖ్యత కొరవడడంపై రాష్ట్ర క్యాబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది! చిన్నపాటి అంశాల్లో విభేదాలతో మంత్రులు రచ్చ చేసుకోవద్దని, స్వల్ప వివాదాలకు సంబంధించి రోడ్డెక్కడం సరికాదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది. అనవసర విషయాలకు రాద్ధాంతం చేసుకోవడం వల్ల ప్రజలతో పాటు ప్రతిపక్షాల్లో కూడా పలుచన అవుతున్నామని హితవు పలికినట్లు సమాచారం. ఇలాంటి అవాంఛిత ఘటనలను నివారించాలని సూచించినట్లు తెలిసింది. ఇప్పటివరకు జరిగిన ఘటనలను టీకప్పులో తుపానులా భావించి.. ఇక నుంచి సంఘటితంగా ఉండాలని, ఈ విషయంలో ప్రజలకు స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు సమాచారం. అలాగే ప్రభుత్వంపై, మంత్రులపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినప్పుడు.. సంబంధిత ఘటనకు సంబంధించి సమగ్ర వివరాలు ప్రజలకు తెలియజేయాలని కూడా మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. సచివాలయంలో గురువారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో
మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడంపైనే సుదీర్ఘంగా చర్చ జరిగింది. ముఖ్యంగా మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిల మధ్య కాంట్రాక్టుకు సంబంధించిన వివాదం; కొండా సురేఖ మాజీ ఓఎస్డీని అరెస్టు చేసేందుకు పోలీసులు మంత్రి నివాసానికి వెళ్లినప్పుడు జరిగిన రభస; మంత్రి పొన్నం ప్రభాకర్ నోరు జారడంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి; మంత్రులు అడ్లూరి, వివేక్ మధ్య వివాదం తదితర అంశాలపై చర్చించారు. చిన్నచిన్న అంశాలపై మంత్రులు రచ్చ చేసుకోవడం వల్ల ప్రజల్లో చులకన అవుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలకు మనమే అస్త్రం అందించినట్లు అవుతోందన్న చర్చ కూడా జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డిల మధ్య వివాదానికి బీఆర్‌ఎస్ పార్టీ నేతలు మరికొన్ని కల్పితాలను జోడించి ప్రచారం చేస్తున్నారన్న చర్చ జరిగింది. కాగా, సీఎం రేవంత్‌ని ఉద్దేశించి తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొండా సురేఖ విచారం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా జరిగింది వదిలేసి.. ఇకపై మంత్రులంతా సంఘటితంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు. సురేఖ, పొంగులేటి మధ్య వివాదం ముగిసిందన్న సంకేతాన్ని ఇచ్చేందుకుమీడియా సమావేశంలో వారిద్దరూ కలిసి కూర్చున్నారు. మీడియాకు పరిచయం చేసేటప్పుడు సురేఖ అక్క అంటూ పొంగులేటి పరిచయం చేయడం విశేషం.
పారదర్శకంగా ఉందాం..
ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోవడం, ఆమోదించవద్దంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం.. దీని వెనక మద్యం కాంట్రాక్టుల వివాదం ఉందంటూ బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఆరోపణలు చేయడంపైనా క్యాబినెట్‌లో చర్చ జరిగింది. వాస్తవానికి కేటీఆర్ వ్యాఖ్యలపై సమాధానం ఇచ్చేందుకు గురువారం మధ్యాహ్నమే జూపల్లి ప్రెస్ మీట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించిన తర్వాత మాట్లాడవచ్చన్న సీఎం రేవంత్ సూచనతో ఆయన సమావేశాన్ని రద్దుచేసుకున్నారు. ప్రతి అంశానికి కట్టుకథలు జోడించి ప్రచారం చేయడం బీఆర్‌ఎస్ నేతలకు అలవాటుగా మారిందని జూపల్లి అన్నట్లు తెలిసింది. రిజ్వీకి ఒక ప్రముఖ కార్పొరేటు గ్రూపులో నెలకు రూ.10 లక్షల వేతనంతో ఉద్యోగం ఆఫర్ రావడంతోనే ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారని మంత్రి చెప్పినట్లు సమాచారం. ఇలాంటి వివాదాస్పద అంశాల్లో పారదర్శకంగా ఉందామని.. ఏం జరిగిందీ మీడియా సమావేశంలో ప్రజలకు వివరించాలని సహచర మంత్రులు సూచించారు. వారి సూచన మేరకు మీడియాకు పూర్తి వివరాలు తెలిపారు. స్థానిక ఎన్నికలపై ఏం చేద్దామంటూ సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులను అడిగారు. తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్‌లు పార్టీ పరంగా బీసీలకు 42 శాతం టికెట్లు ఇస్తామని ప్రకటించి ఎన్నికలకు వెళదామన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులూ రావట్లేదని గుర్తుచేశారు. మెజారిటీ మంత్రులు మాత్రం ఈ అంశాన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చాం కాబట్టి.. హైకోర్టు స్పందనను బట్టి నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఆలోగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగుస్తుందని, అందులో గెలిచి.. స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చని అభిప్రాయపడ్డారు.
మా పాప వ్యాఖ్యలపై
క్షమాపణ చెబుతున్నా: సురేఖ
సీఎం రేవంత్‌రెడ్డిపై తన కూతురు చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. తనకు ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తి విషయంలో జరిగిన వ్యవహారం, మంత్రిగా ఉన్నప్పటికీ రాత్రివేళ తన ఇంటికి మఫ్టీలో పోలీసులు రావడంతో చోటుచేసుకున్న అంశంపై కొండా స్పందించారు. ‘‘టీ కప్పులో తుపానులా కొంత గొడవ జరిగింది. మా ఇంటికి పోలీసులు రావడంతో మా పాప సీఎం రేవంత్‌పై కొంత ఆవేశంగా మాట్లాడింది. అందుకు క్షమాపణ చెబుతున్నా. మాదంతా ఒకటే కుటుంబం. అంతా సర్దుకుపోయాం. కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే’’ అని చెప్పారు.