BuildNow App: దూసుకెళ్తున్న బిల్డ్ నౌ
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:38 AM
భవన నిర్మాణ, లే అవుట్ అనుమతులు అత్యంత వేగంగా పారదర్శకంగా జారీ చేసేందుకు సర్కారు
69 అంతస్తుల భవనానికి 64 సెకన్లలోనే అనుమతి!
37 నిమిషాల్లోనే 13,665 దరఖాస్తుల పరిశీలన.. సులభంగా భవన నిర్మాణ అనుమతులు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ, లే అవుట్ అనుమతులు అత్యంత వేగంగా పారదర్శకంగా జారీ చేసేందుకు సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన బిల్డ్‌నౌ అప్లికేషన్ దూసుకుపోతోంది. ఎన్ని అంతస్తుల భవన నిర్మాణ దరఖాస్తు అయినా క్షణాల్లో స్ర్కూటినీ పూర్తవుతోంది. దరఖాస్తుదారులతో పాటు అధికారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. గతంలో టీజీబీపాస్ అప్లికేషన్‌ను వాడిన సమయంలో అధికారులకు రోజుల తరబడి సమయం పట్టేది. దీంతో దాని స్థానంలో బిల్డ్ నౌ అప్లికేషన్‌ను తెచ్చారు. రాష్ట్రానికి చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు స్టార్టప్ ద్వారా ఈ బిల్డ్‌నౌ అప్లికేషన్‌ను అభివృద్ధి చేశారు. జీవో 168 నిబంధనల ప్రకారం వివరాలు నమోదు చేసేలా బిల్డ్‌నౌను రూపొందించారు. దీంతో నిబంధనల ప్రకారం వివరాలుంటేనే ఆ దరఖాస్తును బిల్డ్‌నౌ స్వీకరిస్తుంది. సంబంధిత దరఖాస్తు పరిశీలన ప్రక్రియ కూడా క్షణాల్లోనే పూర్తవుతోంది. బిల్డ్‌నౌను తొలుత జీహెచ్‌ఎంసీలో అమలు చేయగా.. ఆ తర్వాత హెచ్‌ఎండీఏతో పాటు డీటీసీపీ రాష్ట్రవ్యాప్తంగా అన్నీ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో అమలు చేస్తున్నారు.
గతంలో రోజుల తరబడి సమయం
గతంలో డెవల్‌పమెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్), టీజీబీపాస్ అప్లికేషన్లు ఉన్న సందర్భంలో దరఖాస్తు పరిశీలన చేయడానికి ఒక ప్లానింగ్ అధికారికి రోజుల తరబడి సమయం పట్టేది. ఎన్ని అంతస్తుల భవనమైతే అన్ని ఎక్కువ రోజులు కేవలం దరఖాస్తు స్ర్కూటినీకే సమయం సరిపోయేది. కానీ ప్రస్తుతం బిల్డ్‌నౌ అప్లికేషన్‌లో దేశంలో ఎక్కడా లేని విధంగా తక్షణ అనుమతి, రిజిస్ట్రేషన్, సింగిల్ విండోలో దరఖాస్తులన్నీ క్షణాల్లో స్ర్కూటినీ అవుతున్నాయి. దక్షిణాదిలోనే అత్యంత ఎత్తైన భవనం కోకాపేటలో 69 అంతస్తులతో నిర్మించడానికి హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేయగా.. కేవలం ఒక నిమిషం 4 సెకన్లలో స్ర్కూటినీ పూర్తవ్వడం విశేషం. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలలో బహుళ అంతస్తుల భవనాల స్ర్కూటినీ ప్రక్రియ క్షణాల్లో పూర్తవుతున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇక బిల్డ్‌నౌ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి ఇప్పటివరకు 13,665 దరఖాస్తులు వచ్చాయి. అందులో తక్షణ అనుమతులిచ్చినవి 8,550, తక్షణ రిజిస్ట్రేషన్లవి 945 కాగా, సింగిల్ విండో దరఖాస్తులు 4,170 వరకు ఉన్నాయి. ఈ మొత్తం దరఖాస్తులను వివిధ స్థాయుల్లో అధికారులు 48,495 సార్లు స్ర్కూటినీ చేయగా.. అందుకు పట్టిన పూర్తి సమయం కేవలం 37.6 నిమిషాలే.. ఇక స్ర్కూటినీ పూర్తయిన తర్వాత డ్రాయింగ్ పీడీఎఫ్ చేసేందుకు అన్ని దరఖాస్తులకు కలిపి 52.47 నిమిషాల సమయం పట్టింది.