BRS Kaleshwaram: కాళేశ్వరం నివేదికపై బీఆర్‌ఎస్ న్యాయపోరాటం?
ABN , Publish Date - Aug 08 , 2025 | 04:41 AM
కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై న్యాయపోరాటం చేసేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇందుకోసం సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్టు తెలిసింది.
సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచన
ఏపీ తలపెట్టిన బనకచర్లపై కూడా
ఢిల్లీ చేరుకున్న హరీశ్, వినోద్
హైదరాబాద్, సంగారెడ్డి, ఆగస్టు7 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై న్యాయపోరాటం చేసేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇందుకోసం సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ గురువారం హడావుడిగా ఢిల్లీ వెళ్లారు. కేసీఆర్ సూచనల ప్రకారం హరీశ్ న్యాయనిపుణులతో చర్చిస్తారని తెలిసింది. రైతు సమస్యలపై మెదక్‌లో గురువారం నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న హరీశ్.. ప్రసంగించకుండానే హుటాహుటిన ఎయిర్‌పోర్టుకు వెళ్లారు.
అప్పటికే అక్కడ వేచి ఉన్న మాజీ ఎంపీ వినోద్, మరో ఇద్దరు న్యాయవాదులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. కాగా, కాళేశ్వరం నివేదిక అసెంబ్లీకి రాకుండా అడ్డుకునేందుకు ఉన్న అవకాశాలపై బీఆర్‌ఎస్ దృష్టి సారించినట్టు సమాచారం. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ రాజకీయ ప్రేరేపితంగా జరిగిందని బీఆర్‌ఎస్ భావిస్తున్నట్టు సమాచారం. అలాగే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బనకచర్లను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారని సమాచారం. ఈ అంశాలపై హరీశ్... సీనియర్ న్యాయవాదులతో గురువారం రాత్రి చర్చించినట్టు తెలిసింది.