BRS Plans Action: బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతి వద్దకు
ABN , Publish Date - Aug 12 , 2025 | 05:43 AM
బీసీ రిజర్వేషన్ల అంశంపై బీఆర్‌ఎస్ కూడా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంపై
కాళేశ్వరం, బనకచర్లపై సుప్రీంకోర్టుకు?
14న కరీంనగర్ బీసీ సభపై దృష్టి పెట్టండి
కేటీఆర్, హరీశ్, వినోద్‌తో భేటీలో కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్న బీఆర్‌ఎస్ చీఫ్?
గజ్వేల్/మర్కుక్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ల అంశంపై బీఆర్‌ఎస్ కూడా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌తో పార్టీ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌ్‌సలో జరిగిన సమావేశంలో ‘బీసీ రిజర్వేషన్ల కార్యాచరణ’పై చర్చించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల విషయమై ఈ నెల 14న కరీంనగర్‌లో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయడంపై దృష్టి సారించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో అవసరమైతే రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని, బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్, హరీశ్‌రావులను ఆదేశించినట్లు తెలిసింది. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక విషయంలోనూ కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలని, బనకచర్లపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజలకు తెలియజేయాలని.. అవసరమైతే ఈ రెండు అంశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై పరిశీలించాలని చెప్పినట్లు సమాచారం. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జ్వరంతో భాధపడుతున్నట్లు తెలిసింది. నెల రోజుల క్రితం యశోద ఆస్పత్రితో పాటు ఏఐజీలో చికిత్స పొందిన ఆయనకు తాజాగా మళ్లీ జ్వరం వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో మరోసారి ఆస్పత్రిలో చేరి, చికిత్స తీసుకోనున్నట్లు తెలిసింది. అక్కడి నుంచే కేసీఆర్ కరీంనగర్ బీసీ సభకు వె ళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీ సభ ఏర్పాట్లపై ఎంపీ వినోద్‌కు పలు సూచన లు చేసినట్లు తెలిసింది.