Share News

కవిత ఆరోపణలు అబద్ధం : ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌

ABN , Publish Date - Nov 16 , 2025 | 05:30 AM

రీజినల్‌ రింగ్‌ రోడ్‌ పక్కన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం రెడ్డిపల్లిలో తనకు 18 ఎకరాల భూమి ఉందని అక్కడి రైతులు చెప్పారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు...

కవిత ఆరోపణలు అబద్ధం : ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌

  • బీఆర్‌ఎస్‌లో హరీశ్‌, కేటీఆర్‌లు కృష్ణార్జునులు

  • మెదక్‌ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మల్లికార్జున్‌ గౌడ్‌

హైదరాబాద్‌/మెదక్‌ మునిసిపాలిటీ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగ్‌ రోడ్‌ పక్కన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం రెడ్డిపల్లిలో తనకు 18 ఎకరాల భూమి ఉందని అక్కడి రైతులు చెప్పారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాలని ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌ అన్నారు. ఈ అలైన్‌మెంట్‌ తన కోసం మార్చారని ఆమె చేసిన ఆరోపణలు అసత్య ప్రచారం తప్ప మరొకటి కాదని, ఆ వాఖ్యలను ఖండిస్తున్నట్లు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ ఆ ప్రాంతంలో భూమి లేదని స్పష్టం చేశారు.తన ప్రతిష్ఠకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించే ఈ తప్పుడు వ్యాఖ్యలపై, చట్టపరమైన స్థాయిలో చర్యలు తీసుకోవడానికి తాను వెనుకాడనని ఆయన పేర్కొన్నారు. కాగా, ఆదరించిన బీఆర్‌ఎస్‌ను, కృష్ణార్జునుల్లాంటి హరీశ్‌రావు, కేటీఆర్‌లను ఎమ్మెల్సీ కవిత విమర్శిస్తూ మాట్లాడటం తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్లుగా ఉందని మెదక్‌ మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ ఆరేళ్ల మల్లికార్జున్‌ గౌడ్‌ మండిపడ్డారు. శనివారం మెదక్‌ బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో కవిత బీఆర్‌ఎస్‌ పార్టీ వల్లే ఎంపీ అయ్యారని, ఆమె అవినీతికి పాల్పడి అడ్డమైన దందాలు చేసి ప్రజాదరణ కోల్పోయిన విషయం గుర్తెరగాలన్నారు. కవిత సోయి తప్పి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

Updated Date - Nov 16 , 2025 | 05:43 AM