Vemula Prashanth Reddy: కోమటిరెడ్డి కాదు కోతలరెడ్డి
ABN , Publish Date - Aug 13 , 2025 | 05:39 AM
మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే పిచ్చాస్పత్రికి పంపుతారు : మంత్రి కోమటిరెడ్డిపై ప్రశాంత్‌రెడ్డి ఫైర్
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన పేరు కోమటి రెడ్డి కాదని కోతల రెడ్డి అని ఎద్దేవా చేశారు. మంత్రి కోమటిరెడ్డి సోమవారం సచివాలయంలో తనపై చేసిన వ్యాఖ్యలపై మంగళవారం ప్రశాంత్‌రెడ్డి ప్రతిస్పందించారు. మంత్రి కోమటిరెడ్డికి పిచ్చి లేచిందని, ఆయన మెదడు-నాలుక మధ్య కనెక్షన్ కట్ కావడం వల్లే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబాయికెళ్లి బోటులో షికారు, ఎస్‌ఎల్‌బీసీ పేరుతో అమెరికాకెళ్లి పార్టీలు చేసుకోవడం తప్పా.. వెంకట్ రెడ్డి ఒరగబెట్టిందేమీ లేదన్నారు.
ఆయన తెలివి తక్కువ తనం వల్లే ఎస్‌ఎల్‌బీసీ కూలిపోయిందన్న వేముల.. ఇప్పటికీ నాటి ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను బయటకు తేలేకపోయిన అసమర్థుడని ఎద్దేవా చేశారు. గత రెండేళ్లలో ఆర్ అండ్ బీ మంత్రిగా ఆయన ఒక కొత్త గుంత పూడ్చింది లేదూ ఇటుక పేర్చింది లేదన్నారు. కేసీఆర్ గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నల్లగొండ ప్రజలే వెంకట్‌రెడ్డిని పిచ్చాస్పత్రికి పంపుతారని వ్యాఖ్యానించారు.