BRS Decision: కాళేశ్వరంపై అసెంబ్లీలోనే తేల్చుకుందాం!
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:59 AM
కాళేశ్వరంపై నిజానిజాలను అసెంబ్లీ వేదికగానే తేల్చుకోవాలని బీఆర్‌ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఏకపక్షంగా ఉందని, దాన్ని రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్ దాఖలు చేయగా, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
‘నివేదిక’పై హైకోర్టు తీర్పుతో బీఆర్‌ఎస్ నిర్ణయం
ఫాంహౌ్‌సలో కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్, ప్రశాంత్‌రెడ్డి సమావేశం
హైదరాబాద్/గజ్వేల్ /మర్కుక్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరంపై నిజానిజాలను అసెంబ్లీ వేదికగానే తేల్చుకోవాలని బీఆర్‌ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఏకపక్షంగా ఉందని, దాన్ని రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్ దాఖలు చేయగా, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణను ఐదు వారాల పాటు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎర్రవల్లిలోని ఫాంహౌ్‌సలో కేసీఆర్‌తో ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, వినోద్‌కుమార్, దామోదర్‌రావు సమావేశమయ్యారు. విచారణలో కోర్టు అడిగిన ప్రశ్నలు, ప్రభుత్వం తరఫు న్యాయవాది ఇచ్చిన సమాధానాలు.. తదుపరి ఏం చేయాలన్న దానిపై అధినేతతో చర్చించారు.
అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహిస్తారు? అందులో ఏమేం చర్చిస్తారు? అనే దాన్ని బట్టి ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై న్యాయనిపుణుల సలహా తీసుకుందామని గులాబీ బాస్ చెప్పినట్లు తెలిసింది. కాళేశ్వరంపై నిజానిజాలను అసెంబ్లీ వేదికగా ప్రజల ముందుకు తీసుకెళ్దామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదని సూచించినట్లు సమాచారం. కాళేశ్వరం విషయంలో బీఆర్‌ఎ్‌సను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు పూనుకుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పినట్లు తెలిసింది. కాగా, ఎర్రవెల్లి ఫాంహౌ్‌సలో ఉన్న కేసీఆర్ మరో సారి స్వల్ప అస్వస్థతకు గురి కాగా, ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.