Share News

Marriage Fraud: పెళ్లయినా దాచి.. మళ్లీ పెళ్లి..

ABN , Publish Date - Nov 25 , 2025 | 04:22 AM

ఆమెకు ఇదివరకే పెళ్లయింది.. ఓ కుమార్తె కూడా ఉంది. కానీ ఆ విషయాన్ని దాచి మ్యారేజి బ్యూరో ద్వారా ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. రెండు రోజులకే విషయం బయటపడటంతో బంగారం...

Marriage Fraud: పెళ్లయినా దాచి.. మళ్లీ పెళ్లి..
Marriage Fraud

  • 8.5 తులాల బంగారంతో వధువు పరారీ

  • వివాహమైన ఆమెకు కుమార్తె కూడా

  • మ్యారేజి బ్యూరోను నమ్మి మోసపోయిన వరుడు.. నలుగురిపై కేసు నమోదు

పర్వతగిరి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆమెకు ఇదివరకే పెళ్లయింది.. ఓ కుమార్తె కూడా ఉంది. కానీ ఆ విషయాన్ని దాచి మ్యారేజి బ్యూరో ద్వారా ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. రెండు రోజులకే విషయం బయటపడటంతో బంగారం, నగదుతో పరారైంది. వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలంలోని చౌటపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా సోమవారం బయటికి వచ్చింది.


బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. చౌటపల్లి గ్రామానికి చెందిన 31 ఏళ్ల మట్టపల్లి దేవేందర్‌రావు వ్యవసాయదారు. ఆయన పెళ్లి సంబంధాల కోసం వరంగల్‌లో మ్యారేజి బ్యూరో నడుపుతున్న కోడిపెల్లి అరుణ, రామారావు దంపతులను సంప్రదించారు. వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నిమిషకవి ఇందిర (30) ప్రొఫైల్‌ చూపించారు. ఆమె నచ్చడంతో మ్యారేజీ బ్యూరో ద్వారా సంప్రదింపులు జరిపారు. గత నెల 24న వరంగల్‌ మామూనూరులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో రూ.4 లక్షలకుపైగా ఖర్చుపెట్టి ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి సమయంలో ఇందిర తల్లి తప్ప ఆమె తరఫు బంధువులు, కుటుంబసభ్యులు, స్నేహితులెవరూ హాజరుకాలేదు. అందుకు ఏదో కారణం చెప్పారు. ఇక దేవేందర్‌రావు పెళ్లి సందర్భంగా ఇందిరకు 8.5 తులా ల బంగారు ఆభరణాలు పెట్టారు.


పెళ్లయిన రెండు రోజులకే ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో దేవేందర్‌ ఆమె ఫోన్‌ను చెక్‌ చేశారు. ఆమెకు అప్పటికే పెళ్లయి, కుమార్తె కూడా ఉందని గుర్తించారు. దీనిపై ఇందిరను నిలదీయగా.. పెళ్లి జరిగిన మాట వాస్తవమేనని, కానీ విడాకులు తీసుకున్నానని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తెల్లవారేసరికల్లా ఇందిర.. ఇంట్లోని నగదు, బంగా రు ఆభరణాలు తీసుకుని వెళ్లిపోయింది. పరువు పోతుందని దేవేందర్‌రావు ఈ విషయం బయటికి చెప్పలేదు. చివరికి సోమవారం ఇందిర, ఆమె తల్లి లక్ష్మి, మ్యారేజి బ్యూరో నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందిర గతంలోనూ ఇలా ఒకరిద్దరిని మోసం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయని, దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఎస్సై ప్రవీణ్‌ చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Gold Rates On Nov 25: బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి.. పసిడి, వెండి ధరల్లో కోత

Custody Petition: ఆ మావోయిస్టులను కస్టడీకి ఇవ్వండి

Updated Date - Nov 25 , 2025 | 07:08 AM