మహిళల ఉపాధికి ఊతం
ABN , Publish Date - Feb 19 , 2025 | 01:17 AM
మహిళా సంఘాల్లోని సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రైతులకు ఆసరాగా ఉండేందుకు మహిళా సమాఖ్యలకు రాయితీపై డ్రోన్లు అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
జగిత్యాల, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాల్లోని సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రైతులకు ఆసరాగా ఉండేందుకు మహిళా సమాఖ్యలకు రాయితీపై డ్రోన్లు అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద ముందుగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున డీఆర్‌డీఏ నుంచి ప్రతిపాదనలు రూపొందించారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, వేములవాడ, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపారు. దీని ద్వారా రైతులకు మేలు చేయడంతో పాటు మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతో పథకాన్ని అమలు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 18 మండల మహిళా సమాఖ్య సంఘాలుండగా 14,964 స్వయం సహాయక మహిళా సంఘాలున్నాయి. వీటిల్లో 1,73,412 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు.
ఫ80 శాతం రాయితీపై...
రసాయన ఎరువులను డ్రోన్‌ల ద్వారా పిచికారి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పలు కంపెనీలు కూడా సహకార సంఘాల ద్వారా డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. రూ.10 లక్షల విలువైన డ్రోన్ యంత్రానికి రూ.8 లక్షలు రాయితీ వర్తిస్తుండగా మిగితా రూ.2 లక్షలు మండల మహిళా సమాఖ్యలు భరించాల్సి ఉంటుంది. డ్రోన్లు మండల మహిళా సమాఖ్యలకు అందిన తర్వాత వాటి నిర్వహణకు ఇద్దరిని నియమించనున్నారు. వీరికి శిక్షణ ఇచ్చి పంట పొలాల్లో రసాయనాలు పిచికారీ చేయనున్నారు. డ్రోన్లతో వరి, పత్తి, మామిడి, పసుపు తదితర తోటలకు రసాయనాలు పిచికారి చేసేందుకు అవకాశం ఉండగా మరోవైపు కూలీల కొరతను అధిగమించవచ్చని అన్నదాతలు భావిస్తున్నారు. ఇది విజయవంతం అయితే మండలాల వారీగా విస్తరించేందుకు అవకాశం ఉంటుందని సంబంధిత వర్గాలు అంటున్నాయి.
ఫజిల్లాకు ఐదు యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదన
జిల్లాలోని ఆయా మండలాల్లో ఐదు యూనిట్లను తొలివిడతలో ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మల్లాపూర్ శ్రీకనక సోమేశ్వర మండల సమాఖ్య, వేములవాడ నియోజకవర్గం పరిధిలో కథలాపూర్ అరుణోదయ మండల సమాఖ్య, జగిత్యాల నియోజకవర్గం పరిధిలో రాయికల్ ధన్మలక్ష్మీ మహిళా మండల సమాఖ్య, ధర్మపురి నియోజకవర్గం పరిధిలో గొల్లపల్లి శ్రీ సాయి మహిళా సమాఖ్య, చొప్పదండి నియోజకవర్గం పరిధిలో ఉషోదయ మండల మహిళా సమాఖ్యలను ఎంపిక చేశారు.
ఫపర్యవేక్షణ పెరిగితేనే సత్ఫలితాలు..
ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పరికరాలపై అధికారుల పర్యవేక్షణ పెరిగినప్పుడే సత్పలితాలు సాధించవచ్చని నిపుణులు అంటున్నారు. గతంలో మహిళా సంఘాల ద్వారా సన్న, చిన్నకారు రైతులకు అందుబాటులో ఉండేందుకు ట్రాక్టర్లు, పనిముట్లు కొనుగోలు చేసి అందించారు. జిల్లాలోని పలు మండల సమాఖ్యల ద్వారా కొనుగోలు చేయగా పలు ప్రాంతాల్లో ఉపయోగంలోనూ, మరికొన్ని ప్రాంతాల్లో నిరుపయోగంగా మారాయి. కొన్ని మండలాల్లో కొనుగోలు చేసి రెండు, మూడేళ్లు గడిచినా వినియోగించకుండా నిరుపయోగంగా ఉంటున్నాయని తెలుస్తోంది.
ఉపాధి లభిస్తుంది
-రఘువరన్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి
మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. మహిళా సంఘాలకు రాయితీలపై డ్రోన్లు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. దీని ద్వారా రైతులకు పిచికారీ యంత్రాలు అందుబాటులో ఉండటమే కాకుండా మహిళలకు ఉపాధి లభించనుంది. మహిళా సభ్యులకు బాధ్యతలు అప్పగించి పర్యవేక్షణ పెంచుతాం.