Share News

Lakhnavaram Lake: ప్రాజెక్టులకు జలకళ.. పర్యాటకం జోరు

ABN , Publish Date - Jul 28 , 2025 | 05:36 AM

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని ప్రకృతి రమణీయ తీరం లక్నవరం సరస్సు పర్యాటకులకు మళ్లీ ఆహ్వానం పలుకుతోంది. జలకళతో కళకళలాడుతున్న సరస్సులో 111 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత బోటింగ్‌ ప్రారంభమైంది.

Lakhnavaram Lake: ప్రాజెక్టులకు జలకళ.. పర్యాటకం జోరు

  • లక్నవరంలో బోటింగ్‌ పునఃప్రారంభం

  • బొగత సందర్శనకు అనుమతి

  • భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి

గోవిందరావుపేట, వాజేడు, భద్రాచలం, నాగార్జునసాగర్‌, జూలై 27(ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని ప్రకృతి రమణీయ తీరం లక్నవరం సరస్సు పర్యాటకులకు మళ్లీ ఆహ్వానం పలుకుతోంది. జలకళతో కళకళలాడుతున్న సరస్సులో 111 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత బోటింగ్‌ ప్రారంభమైంది. ఇటీవలి వర్షాలు, వరదలతో సరస్సులోకి గరిష్ఠ స్థాయిలో నీటిమట్టం చేరింది. ఈనేపథ్యంలో బోటింగ్‌ను ప్రారంభించారు. ప్రకృతి ప్రేమికులు బోటుషికారు చేస్తూ ఆనందంగా గడిపారు. కాటేజీల ఆన్‌లైన్‌ బుకింగ్‌లు కూడా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం సందర్శనకు సోమవారం నుంచి అనుమతిస్తూ అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా ఈనెల 23 నుంచి బొగత సందర్శనను అధికారులు నిలిపివేశారు. వర్షాలు, వరద తగ్గుముఖం పట్టడంతో సందర్శనను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. వీక్షణ మాత్రమే అనుమతి ఉంటుందని, ఈత కొలను దిగి స్నానాలు చేయొద్దని సూచించారు.


స్వల్పంగా తగ్గిన గోదావరి నీటిమట్టం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా తగ్గుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు 35.4 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం ఆదివారం సాయంత్రం 5 గంటలకు 34.6 అడుగులకు తగ్గింది. గోదావరి ఒడ్డున స్నానఘట్టాలు నీటమునిగే ఉన్నాయి.


583 అడుగులకు సాగర్‌ నీటిమట్టం

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ జలాశయానికి ఎగువనుంచి భారీగా నీరు వస్తుండటంతో 583 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు. సాగర్‌ నుంచి మొత్తంగా 35,749 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా, పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఎగువ నుంచి 1287.02 క్యూసెక్కుల వరద నీరు మూసీ రిజర్వాయర్‌కు చేరుతోంది. 645 అడుగుల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం గల మూసీ ప్రాజెక్టు నీటిమట్టం ఆదివారం సాయంత్రం 643.30 అడుగులకు చేరింది. ప్రాజెక్టు రెండు క్రస్టుగేట్ల నుంచి 1286.79 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కాల్వల ఆయకట్టులో పంటల సాగుకు మరో 525.69 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Updated Date - Jul 28 , 2025 | 05:36 AM