BJP: బీజేపీలో కొత్త జోష్
ABN , Publish Date - Mar 06 , 2025 | 06:11 AM
పట్టభద్రుల నియోజకవర్గాలు రెండింటినీ బీజేపీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ వర్గాలు సంబురాల్లో మునిగిపోయాయి. ఒకవైపు బలమైన ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థిని సునాయసంగా ఓడించిన బీజేపీ.. మరోవైపు పట్టభద్రుల నియోజకవర్గ పోరులో అఽధికార పార్టీ అభ్యర్థితో జరిగిన హోరాహోరీ పోరులో విజయబావుటా ఎగురవేసింది.
రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపుతో
సంబురాల్లో కాషాయం శ్రేణులు
భవిష్యత్తులో అధికారం తమదేనంటూ ధీమా
హైదరాబాద్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ ‘ఛాంపియన్స్ ట్రోఫీ’ విజేతగా బీజేపీ నిలిచింది. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలు రెండింటినీ బీజేపీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ వర్గాలు సంబురాల్లో మునిగిపోయాయి. ఒకవైపు బలమైన ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థిని సునాయసంగా ఓడించిన బీజేపీ.. మరోవైపు పట్టభద్రుల నియోజకవర్గ పోరులో అఽధికార పార్టీ అభ్యర్థితో జరిగిన హోరాహోరీ పోరులో విజయబావుటా ఎగురవేసింది. కాంగ్రెస్ సిటింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నేతృత్వంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల సమష్టి కృషితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము రికార్డులు తిరగరాశామని కమలనాథులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీని గెలుచుకోవడం క్యాడర్‌లో నూతనోత్సాన్ని నింపిందని బీజేపీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పీఠమే లక్ష్యంగా పెట్టుకున్న తమకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కొత్త జోష్ ఇస్తున్నాయని అన్నారు.
ఉత్తర తెలంగాణలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా, తమ అభ్యర్థులు మొదటి స్థానంలో నిలిచారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమదే అధికారం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా బీజేపీ ఉత్తర తెలంగాణలో మరింత బలోపేతం అవుతుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఈ ప్రాంతంలో పార్టీకి పెద్దదిక్కుగా ఉండగా, ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా గెలవడంతో పార్టీ ఇటు పట్టభద్రులు, అటు ఉపాధ్యాయవర్గాల్లో పట్టు సాధించినట్లయ్యిందని భావిస్తోంది. మరోవైపు..కీలక నేతలంతా తమ ప్రాంతంలో జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు లేకపోవడంతో చేదు ఫలితం చవిచూడాల్సి వచ్చిందని నల్లగొండ జిల్లా పార్టీ నేత ఆవేదన వ్యక్తం చేశారు.’