Local Body Elections: బీజేపీ పల్లె బాట
ABN , Publish Date - Aug 18 , 2025 | 05:10 AM
స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా రైతు, యువత, మహిళా సంఘాలతో భేటీలు నిర్వహించడం, స్థానిక సమస్యలను పరిష్కరించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం వంటి కార్యక్రమాలను చేపట్టనుంది.
స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో కమల దళం
21, 22 తేదీల్లో రంగారెడ్డి జిల్లాలో రాంచందర్‌రావు పర్యటన
హైదరాబాద్, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా రైతు, యువత, మహిళా సంఘాలతో భేటీలు నిర్వహించడం, స్థానిక సమస్యలను పరిష్కరించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం వంటి కార్యక్రమాలను చేపట్టనుంది. మండల, జిల్లా స్థాయిలో రెండు దశల్లో ర్యాలీలు నిర్వహించనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అధ్యక్షతన ఆదివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పల్లె బాటలో భాగంగా రాష్ట్రంలోని 566 మండలాల పరిధిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారు. తమకు కేటాయించిన మండలాల్లో పర్యటిస్తారు. స్థానికంగా వివిధ సంఘాలతో నిర్వహించే సమ్మేళనాలు, రచ్చబండ కార్యక్రమాలకు హాజరవుతారు.
పార్టీ కార్యకర్తలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికకు పోటీపడుతున్న నాయకులతో సమావేశమవుతారు. అదే మండలంలో రాత్రి బస చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత ఈ నెల 21, 22 తేదీల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. మండల, జిల్లా ర్యాలీలు పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలు స్థానిక సంస్థలను ఎలా నిర్వీర్యం చేశాయో వివరిస్తూ ఈ నెల 21 నుంచి 25 వరకు మండల స్థాయిలో నిరసన ర్యాలీలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించారు. అనంతరం 26 నుంచి వచ్చే నెల 2 వరకు జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి కలెక్టర్లకు స్థానిక సమస్యలపై వినతి పత్రాలు అందజేస్తామన్నారు.
రాహుల్‌కు రాజకీయాలపై అవగాహన లేదు: ప్రభాకర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాజకీయాలపై అవగాహన లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎ్‌సఎస్ ప్రభాకర్ విమర్శించారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా మిగిలిందని ఎద్దేవా చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రభాకర్ మాట్లాడారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ వారసత్వ, ఓడిపోయే పార్టీగా మిగిలిపోయిందని పేర్కొన్నారు.