Share News

Protest Over Fee Arrears: ఫీజు బకాయిల కోసం బీజేపీ పోరుబాట

ABN , Publish Date - Oct 24 , 2025 | 06:13 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.

Protest Over Fee Arrears: ఫీజు బకాయిల కోసం బీజేపీ పోరుబాట

  • విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలతో కలిసి వచ్చేనెల తొలివారంలో ‘చలో హైదరాబాద్‌’!

  • కాలేజీ యాజమాన్యాల సమ్మెకు పూర్తి మద్దతు

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

  • బండి సంజయ్‌, లక్ష్మణ్‌తో కాలేజీ యాజమాన్యాల భేటీ

హైదరాబాద్‌, గన్‌పార్క్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో వేల సంఖ్యలో ఉన్న విద్యార్థులు సహా వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బందితో కలిసి వచ్చేనెల మొదటివారంలో ‘ఛలో హైదరాబాద్‌ ’ ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. అలాగే ఫీజు బకాయిలు పూర్తిగా చెల్లించేదాకా దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగించేందుకు కార్యాచరణ రూపొందించు కుంటోంది. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు గురువారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావుతో, కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో వేర్వేరుగా సమావేశమయ్యాయి. బండి సంజయ్‌తో జరిగిన భేటీలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్‌ పాల్గొన్నారు. భేటీ సందర్భంగా.. భవిష్యత్తు కార్యాచరణపై కాలేజీ యాజమాన్యాలతో బండి, లక్ష్మణ్‌ చర్చించారు. రెండు, మూడు రోజుల్లో ఫీజు బకాయిలు చెల్లించని పక్షంలో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు నవంబరు మొదటి వారంలో ‘ఛలో హైదరాబాద్‌’ కార్యక్రమాన్ని నిర్వహించాలనే విషయమ్మీద చర్చలు జరిపారు.


ఈ భారీ ఆందోళనకు బీజేపీ.. ఒకట్రెండు రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేయనుంది. కాగా ప్రతినెలా రూ.500 కోట్ల చొప్పున ఏడాదిలో రూ.6వేల కోట్ల మేర ఉన్న బకాయిలను చెల్లిస్తామని అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సీఎం రేవంత్‌ ప్రకటించారని యాజమాన్యాలు గుర్తు చేశాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ తాము సమ్మె నోఈసు ఇస్తే.. కాలేజీల్లో తనిఖీల పేరుతో విజిలెన్స్‌ బృందాలను పంపి బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ బండి సంజయ్‌, లక్ష్మణ్‌తో యాజమాన్యాలు పేర్కొన్నాయి. అయితే.. బకాయిలు ఎప్పటికప్పుడు చెల్లిస్తే.. తనిఖీలు చేసినా తమకు ఇబ్బంది లేదని, తాము పొరపాట్లు చేసి ఉంటే గనక సరిదిద్దుకునేందుకు సిద్థంగా ఉన్నామని పేర్కొన్నాయి. కాగా యాజమాన్యాల ఆవేదననంతా విన్న బండి సంజయ్‌.. రాంచందర్‌రావుతో ఫోన్‌లో చర్చించారు. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు తనతో ప్రస్తావించిన అంశాలను సంజయ్‌తో రాంచందర్‌రావు పంచుకున్నారు. విద్యాసంస్థల సమ్మెకు సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు రాంచందర్‌రావు ప్రకటించారు. విద్యార్థులు, యాజమాన్యాల న్యాయపరమైన డిమాండ్‌లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించేవరకూ బీజేపీ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం.. కాలేజీ యాజమాన్యాలు చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సంజయ్‌ ప్రకటించారు. ఫీజు బకాయిలు చెల్లించేలా విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రుల పక్షాన నిలబడి బీజేపీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. బకాయిల చెల్లింపుపై అసెంబ్లీలో ఇచ్చిన మాటను సీఎం నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 24 , 2025 | 06:13 AM