BJP: గీత దాటితే.. కమలం నేతలపై వేటే!
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:55 AM
పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలకు తీసుకునేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సిద్ధమయ్యింది.
8 12 మంది నాయకులకు త్వరలో షోకాజ్ నోటీసులు!
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలకు తీసుకునేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సిద్ధమయ్యింది. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారు ఏ స్థాయిలో ఉన్నా చర్యలు తప్పబోవని తేల్చి చెప్పబోతోంది. ముఖ్యంగా, వర్గాలుగా విడిపోయి బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, పెద్దపల్లి జిల్లాలకు చెందిన 12 మంది నాయకులకు షోకాజ్ నోటీసులు ఇవ్వబోతున్నట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు ఆయన సమక్షంలోనే కొంతమంది కార్యకర్తలు, నాయకులు వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, స్థానిక పార్టీలోని రెండు వర్గాల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. పెద్దపల్లి జిల్లాలో కూడా రెండు వర్గాలుగా విడిపోయిన స్థానిక నాయకులు పరస్పరం బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారని, అంతేకాకుండా పార్టీ సమావేశాల సందర్భంగా ఘర్షణలకు దిగారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఘటనలను పార్టీ రాష్ట్ర నాయకత్వం సీరియ్‌సగా తీసుకుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా బీజేపీ శాసనసభాపక్ష సమావేశం శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే జరుగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొని శనివారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
కాంగ్రెస్, ఆర్జేడీ నేతల భాష ప్రతీ తల్లికీ అవమానకరం: బీజేపీ
ప్రధాని మోదీ దివంగత మాతృమూర్తిని కాంగ్రెస్, ఆర్జేడీ నాయకులు అసభ్య పదజాలంతో దూషించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఆ రెండు పార్టీల నాయకులు వాడిన పదజాలం ప్రజాస్వామ్యానికి మచ్చ అని, వారు వాడిన భాష, ప్రతీ తల్లికి, కుమారుడికి అవమానకరమని ఎక్స్ వేదికగా స్పందించారు.