Share News

BJP: హామీలను నెరవేర్చని కాంగ్రెస్‌.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులా?

ABN , Publish Date - Aug 23 , 2025 | 05:29 AM

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు బయలుదేరితే..

BJP: హామీలను నెరవేర్చని కాంగ్రెస్‌.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులా?

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

మొయినాబాద్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు బయలుదేరితే.. బీజేపీ నాయకులను అరెస్టులు చేయిస్తోందన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని ముగించుకొని హైదరాబాద్‌ వెళ్తుండగా మొయినాబాద్‌ పోలీసులు రాంచందర్‌రావును అదుపులోకి తీసుకున్నారు. సచివాలయ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆయన్ను కొద్దిసేపు ఠాణాలో ఉంచారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు పోలీ్‌సస్టేషన్‌ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు.


మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రాంచందర్‌రావుతో పాటు బీజేపీ నాయకులను పోలీస్‌ స్టేషన్‌లో ఉంచి.. తర్వాత పంపించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. వర్షాల వల్ల హైదరాబాద్‌లో రోడ్లన్నీ దెబ్బతిన్నాయని, విద్యుత్‌ దీపాలు వెలగడం లేదని చెప్పారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం వల్ల రామంతాపూర్‌లో శ్రీకృష్ణుడి శోభా యాత్రలో కరెంట్‌ షాక్‌తో ఆరుగురు చనిపోయారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. జనం గోడును తెలిపేందుకు సచివాలయానికి వస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారని, ఎన్ని అరెస్టులు చేసినా ప్రజల పక్షాన పోరాడతామని రాంచందర్‌రావు తేల్చి చెప్పారు.

Updated Date - Aug 23 , 2025 | 05:34 AM