Share News

BJP: వరద బాధితులకు బీజేపీ అండ

ABN , Publish Date - Sep 01 , 2025 | 04:51 AM

రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఆరుగురు బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఎంపీ ల్యాడ్స్‌ నిధుల

BJP: వరద బాధితులకు బీజేపీ అండ

ఎంపీ నిధుల నుంచి రూ.80 లక్షలు సాయం.. కాంగ్రెస్‌ చేతులెత్తేసింది: రాంచందర్‌రావు

  • 17న హైదరాబాద్‌ లిబరేషన్‌ డే

  • పరేడ్‌ గ్రౌండ్‌లో వేడుక

  • హాజరుకానున్న రాజ్‌నాథ్‌: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌/సిటీ/ఖైరతాబాద్‌/బోరబండ, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఆరుగురు బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి ఒక్కొక్కరు రూ.10 లక్షల చొప్పున రూ.80 లక్షలు కేటాయించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. తమ ఎంపీలు తక్షణమే ముందుకు వచ్చి సహాయక చర్యల కోసం నిధులను కేటాయించడం ప్రశంసనీయమని అన్నారు. వర్షాలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలంటూ రాంచందర్‌రావు ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సిరిసిల్ల జిల్లా ప్రజలకు రూ.10 లక్షలు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఎంపీ లాడ్స్‌ నిధుల నుండి ఈ మొత్తాన్ని సిరిసిల్ల కలెక్టర్‌కు త్వరలోనే ఇస్తానని పేర్కొన్నారు.


మోదీ తల్లి పట్ల కాంగ్రెస్‌ వ్యాఖ్యలు సరికాదు: కిషన్‌ రెడ్డి

ప్రధాని మోదీ తల్లి పట్ల కాంగ్రెస్‌ నాయకులు, రాహుల్‌ గాంధీ మానవత్వం లేకుండా మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అలాంటి నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఆదివారం బోరబండలో మన్‌కీ బాత్‌ కార్యక్రమాన్ని ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ భారతదేశంలో విలీనం కావడానికి సర్దార్‌ పటేల్‌ చేసిన కృషిని మోదీ మన్‌ కీ బాత్‌లో ప్రస్తావించారని తెలిపారు. సెప్టెంబర్‌ 17న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ లో హైదరాబాద్‌ లిబరేషన్‌ డేను నిర్వహించనున్నామని, ఆ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరవుతారని వెల్లడించారు. అలాగే విశ్వకర్మ దివ్‌సను జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటామని, అదే రోజు ప్రధాని మోదీ పుట్టిన రోజు కూడా కావడంతో తెలంగాణలో 3ముఖ్యమైన కార్యక్రమాలను ఒకే రోజున నిర్వహిస్తామని చెప్పారు. కాగా, ఖైరతాబాద్‌ మహాగణపతిని ఆదివారం సాయంత్రం కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. ఖైరతాబాద్‌ డివిజన్‌ బీజేపీ అధ్యక్షుడు ఆదర్శ్‌ వంశీకర్‌ తయారు చేయించిన 26 కిలోల లడ్డూను గణేషుడికి సమర్పించారు.

రాహుల్‌ దిష్టిబొమ్మ దహనం

ప్రధాని మోదీ తల్లిపై కాంగ్రెస్‌ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి డిమాండ్‌ చేశారు. బిహార్‌లో రాహుల్‌, ప్రియాంక సమక్షంలోనే కాంగ్రెస్‌ నేతలు మోదీ తల్లిపై దుర్భాషలాడటం దేశ ప్రజల మనసును కలచివేసిందన్నారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద మహిళా మోర్చా నేతలు ధర్నా నిర్వహించారు. రాహు ల్‌ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

Updated Date - Sep 01 , 2025 | 04:51 AM