BJP leaders Bandi Sanjay: అధికారులను బలి చేస్తారా
ABN , Publish Date - Oct 24 , 2025 | 07:02 AM
మీ అవినీతికి తలవంచకపోతే అధికారులను బలి చేస్తారా? మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం.....
మీ అవినీతికి తల వంచకపోతే వేధిస్తారా?:సంజయ్
రిజ్వీ వీఆర్‌ఎ్‌సపై సర్కారు సమాధానం చెప్పాలి: లక్ష్మణ్
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘మీ అవినీతికి తలవంచకపోతే అధికారులను బలి చేస్తారా? మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అధికారులను వేధిస్తారా?’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ అసమర్థ పాలన, అవినీతి రాజకీయాలకు సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వీ వీఆర్‌ఎస్సే నిదర్శనమని వ్యాఖ్యానించారు. నిజాయితీగల, సమర్థుడైన అధికారి వీఆర్‌ఎస్ తీసుకునే పరిస్థితి ఎందుకొచ్చిందని సంజయ్ ప్రశ్నించారు. ‘టెండర్లలో మంత్రులు జోక్యం చేసుకుంటున్నారు. నిబంధనలు మార్చుతారు. అవినీతి బయటపడితే రాజీ పడని అధికారులపైనే నిందలు వేస్తారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇదే చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ అధికారులను బలి చేశారు. ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్ అధికారులపై నిందలు మోపారు. కాంగ్రెస్ సైతం బీఆర్‌ఎస్ దారిలోనే నడుస్తోంది’ అని సంజయ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. రిజ్వీ వీఆర్‌ఎస్ తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై అనుమానాలకు తావిస్తోందని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రిజ్వీ ఎందుకు వీఆర్‌ఎస్ తీసుకోవాల్సి వచ్చిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.