BJP: జాతీయవాదం స్ఫూర్తితోనే ‘హర్ ఘర్ తిరంగ’
ABN , Publish Date - Aug 15 , 2025 | 04:50 AM
జాతీయవాదమే స్ఫూర్తిగా బీజేపీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమం చేపడుతున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు పేర్కొన్నారు.
తెలంగాణలో 40 లక్షల ఇళ్లపై త్రివర్ణ పతాకం ఎగురవేస్తాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు
హైదరాబాద్ సిటీ/కేపీహెచ్‌బీకాలనీ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): జాతీయవాదమే స్ఫూర్తిగా బీజేపీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమం చేపడుతున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు పేర్కొన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో గురువారం నిర్వహించిన తిరంగా ర్యాలీని రాంచందర్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. అలాగే, స్వచ్ఛభారత్ అబియాన్ ఆధ్వర్యంలో మార్చ్ ఫర్ ది నేషన్ పేరిట కూకట్‌పల్లి నియోజకవర్గంలో 1000 మీటర్ల జాతీయ జెండాతో నిర్వహించిన తిరంగా ర్యాలీని కూడా ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో రాంచందర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల ఇళ్లపై త్రివర్ణ పతాకం ఎగురవేసి దేశభక్తిని చాటడం, జాతీయ భావం పెంపొందించడమే తమ లక్ష్యమని తెలిపారు. మతం ఆధారంగా నాడు దేశాన్ని విభజించిన బ్రిటిషర్లకు కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికిందని అన్నారు. మరోసారి దేశ విభజన ప్రసక్తి ఉండకూడదనే లక్ష్యంతో భారతదేశ ఐక్యత, సమగ్రతను, సంస్కృతిని కాపాడేలా తిరంగా యాత్ర ద్వారా సంకల్పం తీసుకున్నామన్నారు. తిరంగా యాత్ర ప్రతీ పౌరుడి గుండెలో దేశభక్తిని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నెక్లెస్ రోడ్డులో చేపట్టిన తిరంగా ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువత, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.