భూమంతర్
ABN , Publish Date - Feb 08 , 2025 | 01:17 AM
దేవరకొండ డివిజనలో కొన్నేళ్లుగా ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా భూకబ్జాలు కొనసాగుతూనే ఉన్నాయి.

భూమంతర్
విలువైన భూములు అన్యాక్రాంతం
డివిజనలో కోట్లాది రూపాయల విలువజేసే ప్రభుత్వ భూములు కబ్జా
ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
దేవరకొండ, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): దేవరకొండ డివిజనలో కొన్నేళ్లుగా ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా భూకబ్జాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేవరకొండ డివిజనలో కోట్లాది రూపాయలు విలువ జేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రభుత్వ వక్ప్‌బోర్డు భూములను భూ ఆక్రమణదారులు ఆక్రమించుకుంటున్నారు. జిల్లా కలెక్టర్, లోకాయుక్తకు ప్రజలు ఫిర్యాదు చే సినా భూ ఆక్రమణలు ఆగడం లేదు. భూముల ధరలు విపరీతం గా పెరిగిపోతుండటంతో దేవరకొండ డివిజనలో కోట్లాది రూపాయల విలువజేసే ప్రభుత్వ భూములపై ఆక్రమణదారులు కన్నేసి ఆక్రమించుకుంటున్నారు. దేవరకొండ పట్టణంలో ఎకరా రూ.కోటి రూపాయల విలువ చేస్తుండగా, మిగతా ప్రాంతాల్లో రూ. 50లక్షల పైగా ధర పలుకుతోంది.
దేవరకొండ పట్టణంలో..
దేవరకొండ పట్టణంలోని సర్వే నెంబర్ 753, 756లలో వక్ఫ్ బో ర్డు, 750 సర్వే నెంబర్‌లో ప్రభుత్వ భూమి మొత్తం 30 ఎకరాల వరకు విస్తరించి ఉంది. 2014 కంటే ముందు నుంచే ప్రభుత్వ, వ క్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతమవుతూనే ఉన్నాయి. కరోనా లా క్‌డౌన సమయంలో అధికంగా వక్ఫ్ బోర్డు భూముల్లో అప్పటి అధికార పార్టీ నాయకులు, రియల్‌ఎస్టేట్ వ్యాపారులు అధికారుల అండదండలతో అక్రమ నిర్మాణా లు చేపట్టారు. ఈ అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. వారి ఆదేశాల మేరకు మునిసిపల్, రెవెన్యూ అధికారులు 295 మందికి నోటీసు లు అందజేసి చేతులు దులుపుకున్నారు. మునిసిపల్, రెవెన్యూశాఖల సమన్వయం లేకపోవడం, అధికార పార్టీ అండదండలతో భూకబ్జాలు అధికంగా జరుగుతున్నాయని అధికారులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. దీంతో అధికారులు కబ్జాలపై పత్రికల్లో వార్తలు, కథనాలు వచ్చినప్పుడు మొక్కుబడిగా నోటీసులు జారీ చేస్తున్నారు తప్ప ఎలాంటి చర్య లు చేపట్టడం లేదు.
కొండమల్లేపల్లి మండలం కోల్‌ముంతలపహాడ్‌లో 202 సర్వే నెంబర్‌లో 290 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉండగా అందులో 30 ఎకరాలకుపైగా అన్యాక్రాంతమైంది. డిండి మండల కేంద్రంలో నీటిపారుదల శాఖకు చెందిన 400ఎకరాలకు పైగా భూ ములు ఉన్నాయి. 50 ఎకరాలకుపైగా భూములు కబ్జాకు గురైంది. భూముల విలువ పెరగడంతో భూఆక్రమణదారులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని కట్టడాలు చేపడుతున్నారు. దేవరకొండ మండలం కాచారంలో గత ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటు కోసం ప్రభుత్వ భూమిని కేటాయించింది. కానీ నిధులు మంజూరుకాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. కేటాయించిన ప్రభుత్వ భూమి 20 ఎకరాలకుపైగా ఆక్రమణకు గురైనట్లు గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. భూముల ధరలు విపరీతంగా పెరిగిపోతుండడంతో రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములపై దృష్టి సారించి అధికారుల అండదండలతో భూకబ్జాలకు పాల్పడుతున్నారు.
కాంగ్రెస్ హయాంలోనూ ఆగని భూఆక్రమణలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా డివిజన పరిధిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. పట్టణంలోని 750 సర్వే నెంబర్‌తోపాటు కాచారం, కోల్‌ముంతలపహాడ్, డిండి మండలకేంద్రంలోని భూముల్లో అక్రమ కట్టడాలు, ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారని అధికారులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. అధికారులు భూకబ్జాదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని పరిరక్షించాలని దేవరకొండకు చెందిన వంశీమోహన, వస్కుల సుధాకర్, వెంకటేష్ లోకాయుక్తకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
విచారణ చేసి చర్యలు చేపడుతాం
ప్రభుత్వ భూములను ఇప్పటికే గుర్తించి హద్దులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభు త్వ భూములను ఆక్రమించుకుంటే విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకుంటాం. ప్ర భుత్వ భూములను పూర్తిస్థాయిలో గుర్తించే పనిలో ఉన్నాం. భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం.
రమణారెడ్డి, ఆర్డీవో, దేవరకొండ