Telangana Government: ప్రజల గుండెల్లో నిలిచిపోవాలి
ABN , Publish Date - Aug 12 , 2025 | 05:05 AM
ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా పనులు చేయాలి. మానవీయ కోణంతో ప్రతి పనిని, బాధ్యతను ..
ఆ విధంగా పనులు చేయాలి.. ఎస్‌ఆర్ శంకరన్‌లాగా పేరు తెచ్చుకోవాలి
ఎక్కడ.. ఏ హోదాలో ఉన్నా రాష్ట్రానికి సహకారం అందించాలి: డిప్యూటీ సీఎం భట్టి
యూపీఎస్సీ మెయిన్స్‌కు ఎంపికైన 178 మందికి ‘అభయహస్తం’ ఉపకార వేతనాలు
హైదరాబాద్/కొత్తగూడెం టౌన్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా పనులు చేయాలి. మానవీయ కోణంతో ప్రతి పనిని, బాధ్యతను ప్రభావవంతంగా నిర్వర్తించాలి. సవాళ్లను స్వీకరిస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలి’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. సోమవారం ప్రజాభవన్‌లో రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ఉపకార వేతనాల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. ఈ పథకాన్ని సింగరేణి కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కార్యక్రమంలో భట్టి మాట్లాడుతూ.. దేశ అత్యున్నత సర్వీసులైన యూపీఎస్సీకి సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎంతో కొంత సహాయం చేయాలని రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకాన్ని తెచ్చామని చెప్పారు. మెయిన్స్‌కు ఎంపికైన వారికి రూ.లక్ష, మెయిన్స్‌లో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూలకు హాజరుకానున్న అభ్యర్థులకు మరో రూ.లక్ష ఉపకార వేతనం ఇస్తున్నామన్నారు. తొలివిడతలో ఈ పథకాన్ని తెచ్చిన ఏడాదిలో 148 మంది ఎంపికైతే.. వారికి ఉపకార వేతనం ఇవ్వగా.. వారిలో 10 మంది సివిల్స్‌కు ఎంపికయ్యారని గుర్తు చేశారు. ప్రస్తుతం 178 మందికి ఉపకార వేతనం ఇస్తున్నామని, ఈ దఫా యూపీఎస్సీకి ఎంపికయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరగాలని కోరుకుంటున్నామన్నారు. ఎంపికైన వారు ఏ రాష్ట్రంలో, ఏ హోదాలో ఉన్నా.. రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. దేశంలో తెలంగాణ నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థుల ఎంపిక జరగాలని ఆకాంక్షించారు. ‘ఎందరో ఐఏఎ్‌సలు పనిచేస్తున్నా.. కొందరు మాత్రమే చిరస్థాయిగా ప్రజల్లో గుండెల్లో నిలిచిపోతారు. వారిలో ఎస్‌ఆర్ శంకరన్, పార్థసారఽథి, మాధవరావు లాంటి వారినే ఆదర్శంగా తీసుకుంటున్నాం. లక్ష్యాలు ఎంత గొప్పగా ఉన్నా.. అమలు చేయాలనే తపన ఉండాలి. ఎస్‌ఆర్ శంకరన్ ఎన్నో శాఖల్లో పనిచేసినా ఆయనకు పేరు ప్రతిష్ఠలు తెచ్చింది సంక్షేమశాఖనే..’ అని చెప్పారు. .
నా ఢిల్లీ ఫ్లాట్‌లో 6 బెడ్రూంలు అభ్యర్థులకే: కోమటిరెడ్డి
‘నాకు ఢిల్లీలో ఏడు బెడ్రూంల ఫ్లాట్ ఉంటే.. అందులో ఆరింటిని సివిల్స్ శిక్షణ, ఇంటర్వ్యూలకు వ చ్చే వారికి ఇచ్చి నిరంతరం టీ, టిఫిన్‌లు అందించే ఏర్పాట్లు కూడా చేశాను’ అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. 35 ఏళ్లపాటు సర్వీసులో ఉండాల్సిన వారు సమాజానికి మెరుగైన సేవలందించాలన్నారు. సింగరేణి చరిత్రలో ఉపకారవేతనాలిచ్చే కార్యక్రమాలు ఎప్పుడూ జరగలేదని చెప్పారు. ‘రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే స్కిల్ డెవల్‌పమెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. 65 కేంద్రాల్లో మైక్రోసాఫ్ట్ ద్వారా శిక్షణ ఇస్తున్నాం. ఉద్యోగాల కోసం వచ్చే వేలాది మందికి అపాయింట్‌మెంట్ ఇప్పిస్తున్నా చాలామంది ఇంటర్వ్యూల్లో రాణించలేకపోతున్నారు’ అని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో రూ.20 వేల కోట్లతో యంగ్ ఇండియా సమీకృత గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా విద్యా రంగానికి 22 శాతం బడ్జెట్‌ను కేటాయించామని వెల్లడించారు. సివిల్స్ కోచింగ్ తీసుకునే అభ్యర్థులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. తెలంగాణ అభ్యర్థులు దేశ అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా తొలి ఏడాది ఉపకార వేతనాలు అందుకొని.. యూపీఎస్సీకి ఎంపికైన 10 మంది అభ్యర్థులకు జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. ఆ తర్వాత తాజా మెయిన్స్‌కు అర్హత సాధించిన 178 మందికి రూ.లక్ష చొప్పున ఉపకార వేతనాల చెక్కులను అందజేశారు.