Deputy CM Bhatti Vikramarka: ఫ్యూచర్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్
ABN , Publish Date - May 21 , 2025 | 05:38 AM
ఫ్యూచర్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. జనాభా అధికంగా ఉన్న పట్టణాల్లోనూ దీన్ని అమలు చేయాలని యోచిస్తున్నారు.
జనాభా ఎక్కువున్న పట్టణాల్లోనూ ఏర్పాటుకు యోచన: భట్టి
హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలో జనాభా ఎక్కువగా ఉన్న పట్టణాల్లోనూ దీనిని అమలు చేయాలనే ఆలోచన ఉన్నట్టు తెలిపారు. ఈ వ్యవస్థలో భూమి లోపల చాంబర్లు నిర్మించి, విద్యుత్ పరికరాలు, ఇన్సులేటెడ్ తీగలను ఏర్పాటు చేసి.. విద్యుత్ సరఫరా చేస్తారు. ఇప్పటికే బెంగళూరులోని పలు ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా విధానం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో భట్టి మంగళవారం రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారులతో కలిసి బెంగళూరులో పర్యటించారు. అక్కడి అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా తీరును పరిశీలించారు. కర్ణాటక విద్యుత్ సరఫరా కార్పొరేషన్, బెంగళూరు ఎలక్ర్టిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ (బీఈఎస్‌సీఓఎం) అధికారులు, ఇంజనీర్లతో సమావేశమయ్యారు. అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా ప్రాజెక్టుకు బ్యాంకు రుణాలు, సాంకేతిక సమస్యలు, నష్టాలు, లాభాలు, ప్రమాదాలు తదితర వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణలోని పట్టణ గ్రిడ్ ఆధునికీకరణలో భాగంగా అండర్‌గ్రౌండ్ విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని భట్టి ఈ సందర్భంగా పేర్కొన్నారు.