Bhatti Vikramarka: జలాల్లో వాటా తేలాకే.. ప్రాజెక్టులు కట్టుకోవాలి
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:22 AM
నదుల వరద జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల వాటా ఎంతెంతో తేలిన తర్వాతే ప్రాజెక్టులు కట్టుకుంటే న్యాయబద్ధంగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు
తెలంగాణ తెచ్చుకున్నదే నదీ జలాల కోసం
మా అవసరాలు తీరకుండా దిగువన ప్రాజెక్టులు కడితే సమస్యగా మారుతుంది
సముద్రంలోకెళ్లే జలాలు అనడం సరికాదు
మా ప్రాజెక్టులు పూర్తయి వాటాలు తేలాక మిగిలిన నీటిని వాడుకోవచ్చు
వాటాలు తేల్చాల్సిన బాధ్యత కేంద్రానిదే
ఏపీలోని విశాఖపట్నంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
విశాఖపట్నం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): నదుల వరద జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల వాటా ఎంతెంతో తేలిన తర్వాతే ప్రాజెక్టులు కట్టుకుంటే న్యాయబద్ధంగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని.. తెలంగాణ తెచ్చుకున్నదే నదీ జలాల కోసం, బీడు భూములను సాగులోకి తెచ్చుకోవడం కోసమని చెప్పారు. ఏపీలోని విశాఖ నగర పర్యటనకు వచ్చిన భట్టి ఆదివారం ఉదయం అక్కడ మీడియాతో మాట్లాడారు. సముద్రంలోకి వెళ్లే జలాలు అంటూ ఏపీ నేతలు మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. గోదావరి నదిపై తెలంగాణ చేపట్టిన ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్, దేవాదుల వంటి ప్రాజెక్టులు పూర్తికాలేదని చెప్పారు. తమ ప్రాజెక్టులు వాటాలు తేల్చి మిగిలిన వాటిని సమృద్ధిగా వాడుకోవచ్చని పేర్కొన్నారు.
అలాకాకుండా తమ అవసరాలు తీరకుండా దిగువన ప్రాజెక్టులు నిర్మిస్తే.. భవిష్యత్తులో నీటి కేటాయింపుల సమస్యలు వస్తాయని స్పష్టం చేశారు. నీటి వాటాలు తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. తెలంగాణ కాంగ్రె్‌సలో అసమ్మతి లేదని, పార్టీ తెలంగాణలో బలంగా ఉండాలనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరుతున్నారని భట్టి చెప్పారు. ఏపీలో కూడా కాంగ్రెస్ బలపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ వెలుగొందుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు, రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి హాట్‌లైన్‌లో టచ్‌లో ఉన్నారంటూ వైఎస్ జగన్ చేసిన ఆరోపణలు ఆయన వ్యక్తిగతమన్నారు. కాగా, నచ్చిన పాలకులను ఎన్నుకునేందుకు రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును కేంద్ర పాలకులు కాలరాస్తున్నారని భట్టి విమర్శించారు. అందుకే తమ నాయకుడు రాహుల్‌గాంధీ ఉద్యమిస్తున్నారని, ప్రజలు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.